వయసు మీద పడుతున్నా యువకులతో సమానంగా పోటీపడుతూ కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో నిలిచిన ఆధునిక టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అల్కరాజ్ వంటి బలమైన ప్రత్యర్థిని దాటి.. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న అతడి జోరుకు గాయం అడ్డుకట్ట వేసింది. సెమీస్‌లో ఎడమ కాలి గాయం తిరగబెట్టడంతో తొలి సెట్ ముగియగానే జొకో.. నిరాశగా కోర్టును వీడాడు. నొవాక్ తప్పుకోవడంతో అతడి సెమీస్ ప్రత్యర్థి జ్వెరెవ్.. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు.
మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు భారీ షాక్ తగిలింది. తనకు పది టైటిల్స్ అందించిన ఆస్ట్రేలియా ఓపెన్లోనే ఈ రికార్డును సాధించే దిశగా సెమీస్ చేరిన సెర్బియా యోధుడి పోరాటానికి గాయం బ్రేక్ వేసింది. రాడ్లీవర్ ఎరీనా వేదికగా శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీస్‌లో ఏడో సీడ్ జొకో 6-7 (5/7)తో రెండో సీడ్ జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓడాడు. గంటా 21 నిమిషాల పాటు జరిగిన పోరులో ఒకే ఒక సెట్‌ను గెలిచేందుకు జొకో, జ్వెరెవ్ హోరాహోరీగా పోరాడారు.
టైబ్రేక్‌లో ఇబ్బందిపడ్డ నొవాక్..జర్మనీ ఆటగాడు సెట్ నెగ్గగానే నెట్ దగ్గరకు వెళ్లి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ్నుంచి నిరాశగా వెళ్లిపోవడంతో అతడి అభిమానుల గుండె పగిలింది. అతడి నిష్క్రమణతో జ్వెరెవ్ తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. మ్యాచ్ అనంతరం జొకో మాట్లాడుతూ.. ‘ఒకవేళ నేను మొదటి సెట్‌ను గెలిచినా మ్యాచ్ నుంచి తప్పుకునేవాడిని. బంతిని కొట్టేందుకు కూడా వీలుకానంతగా గాయం ఇబ్బంది పెట్టింది. క్వార్టర్స్‌లో అల్కరాజ్ మ్యాచ్ నుంచే గాయం వేధిస్తోంది’ అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు.
పురుషుల సింగిల్స్ రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ వరుసగా రెండో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఈ ఇటలీ కుర్రాడు 7-6 (7/2), 6-2, 6-2తో అమెరికా సంచలనం బెన్ షెల్టన్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ చేరిన షెల్టన్.. కీలక పోరులో మాత్రం సిన్నర్ జోరు ముందు నిలవలేకపోయాడు.
తొలి సెట్లో కాస్త పోరాడిన అతడు ఆ తర్వాత తేలిపోయాడు. మ్యాచ్‌లో సిన్నర్ 8 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టాడు. 55 అనవసర తప్పిదాలతో షెల్టన్ మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం జరుగబోయే ఫైనల్లో సిన్నర్.. జ్వెరెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో భాగంగా అరీనా సబలెంక, మాడిసన్ కీస్ శనివారం టైటిల్ పోరులో తలపడనున్నారు.