లండన్ : 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టాలన్న జోకోవిచ్(Novak Djokovic) ఆశకు మళ్లీ బ్రేక్ పడింది. వింబుల్డన్ సెమీస్ మ్యాచ్‌లో అతను వరల్డ్ నెంబర్ వన్ సిన్నర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 6-3, 6-3, 6-4 స్కోరుతో 38 ఏళ్ల జోకోవిచ్ పరాజయం పాలయ్యాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఇదేమీ తన ఫేర్వెల్ మ్యాచ్ కాదు అని జోకో చెప్పాడు. వింబుల్డన్ కెరీర్‌ను ఇవాళ్టితోనే ముగించాలని భావించడం లేదన్నారు. కచ్చితంగా మళ్లీ వస్తానని, కనీసం ఒక్కసారైనా మళ్లీ వింబుల్డన్‌లో ఆడనున్నట్లు జోకోవిచ్ తెలిపాడు. గతంలో వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్ 8 సార్లు టైటిల్ సాధించారు.ఆ రికార్డును సమం చేయాలని జోకోవిచ్ ట్రై చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా జోకో ప్రయత్నం ఫలించలేదు.
క్వార్టర్స్ మ్యాచ్ టైంలో స్వల్పంగా గాయపడ్డ జోకోవిచ్.. సెమీస్‌లో కష్టంగా మూమెంట్స్ ఇచ్చాడు. గాయం గురించి మాట్లాడాలని లేదని, ఉత్తమమైన ఆట ఆడేందుకు ఇష్టపడుతానని జోకో చెప్పాడు. అనుకున్నట్లుగా కోర్టులో కదలేకపోయానని, దాని పట్ల కొంత నిరాశగా ఉందన్నాడు. మూడవ సెట్‌కు ముందు ట్రైనర్‌తో ట్రీట్మెంట్ చేయించుకున్న జోకో ఆ తర్వాత కొంత రాణించినా.. మళ్లీ వరుసగా ఆరు గేమ్‌లను కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యలు ఉన్నా.. జోకో మాత్రం చాలా దూకుడుగానే ఆడుతున్నాడు.
ఓపెన్ ఎరాలో ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్ కావాలని జోకో ట్రై చేస్తున్నాడు. గతంలో కెన్ రోజ్‌వాల్ 37 ఏళ్ల వయసులో 8 మేజర్ టైటిళ్లను గెలిచాడు. ఇక రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ ఇద్దరూ 36 ఏళ్ల వయసులో చివరి గ్రాండ్‌స్లామ్ నెగ్గారు. ఈ ఏడాది జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్స్‌లో జోకోవిచ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తన కన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లను ఓడించాడు. కానీ సిన్నర్, అల్కరాజ్తో మాత్రం జోకో కాస్త గట్టి ఫైట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కచ్చితంగా సిన్నర్ లేదా అల్కరాజ్తో ఆడాలి.. వాళ్లు ఫిట్, యంగ్, షార్ప్‌గా ఉన్నారు. తాను మాత్రం సగం ఖాళీ ట్యాంక్‌తో వాళ్లను ఢీకొననున్నట్లు చెప్పాడు. కానీ అలాంటి మ్యాచ్‌లను గెలువలేమన్నాడు.
ఆదివారం వింబుల్డన్ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్తో సిన్నర్ తలపడనున్నాడు.