US Open | న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. స్పెయిన్ నయా స్టార్ కార్లోస్ అల్కారజ్‌ను అనుసరిస్తూ డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ టోర్నీ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో రెండో సీడ్ జొకోవిచ్ 4-6, 4-6, 6-2, 4-6తో 28వ సీడ్ అలెక్సీ పాపిరిన్(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో అనుకోని రీతిలో చుక్కుదురైంది. 2017 తర్వాత మేజర్ టైటిల్ లేకుండానే సీజన్ ముగించడం ఈ సెర్బియా స్టార్‌కు ఇది తొలిసారి. 2002 తర్వాత జొకోవిచ్, నాదల్, ఫెదరర్ లాంటి దిగ్గజాలు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ గెలువకపోవడం ఇది మొదటిసారి కావడం విశేషం.
ఈ మధ్యే పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన జొకోవిచ్..కోర్టులో ఒకింత అలసటగా కనిపించాడు. 3 గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి రెండు సెట్లను ప్రత్యర్థికి కోల్పోయిన జొకో..మూడో సెట్లో పుంజుకున్నా ఫలితం లేకపోయింది. మ్యాచ్‌లో 16 ఏస్‌లు కొట్టిన జొకో 14 డబుల్ ఫాల్ట్స్ చేయగా, 16 బ్రేక్ పాయింట్లలో నాలుగే కాపాడుకున్నాడు. మరోవైపు నెట్‌గేమ్‌తో ఆకట్టుకున్న అలెక్సీ 36 వ్యాలీస్‌లో 26 పాయింట్లు రాబట్టాడు. 50 విన్నర్లు కొట్టిన పాపిరిన్..జొకోను దీటుగా నిలువరించాడు. మిగతా మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 5-7, 7-5, 6-1, 6-3తో మార్టిన్ ఎట్జెవరిపై, ఫ్రిట్జ్ 6-3, 6-4, 6-2తో కొమెసెనాపై, రుబ్లెవ్ 6-3, 7-5, 6-4తో లెహెకాపై గెలిచారు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 6-2, 6-4తో కార్బెలాస్ బెనా, కొరియా ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. మరో మ్యాచ్‌లో శ్రీరామ్, అండ్రెజీ జంట 6-7(4/7), 4-6తో నీల్ సుపుస్కి, వీనస్ ద్వయం చేతిలో ఓడింది.