100th Test | టెస్టు క్రికెట్ చరిత్రలో 2024 మార్చి నెల చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. మార్చి 7, 8 తేదీలలో ఏకంగా నలుగురు క్రికెటర్లు వందో టెస్టు ఆడనున్నారు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో లు మార్చి 7న ధర్మశాల వేదికగా జరుగబోయే ఐదో టెస్టులో వందో టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరితో పాటు న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మధ్య మార్చి 8 నుంచి జరగాల్సి ఉన్న రెండో టెస్టులో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్తో పాటు దిగ్గజ పేసర్ టిమ్ సౌథీలు వందో టెస్టు ఆడనున్నారు.
అశ్విన్ వందో టెస్టు ఆడటం ద్వారా ఈ ఫార్మాట్లో భారత్ తరఫున 14వ ప్లేయర్. ఇప్పటివరకూ కెరీర్లో 99 టెస్టులు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు పడగొట్టడమే గాక 3,309 పరుగులు చేశాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనత 35 సార్లు ఉండగా 8 సార్లు పది వికెట్ల ఘనత సాధించాడు. బెయిర్ స్టో 99 టెస్టులలో 5,974 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 12 సెంచరీలు బాదాడు.
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్.. 2010లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 99 టెస్టులు ఆడిన అతడు.. 174 ఇన్నింగ్స్‌లలో 8,675 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు ఉండటం గమనార్హం. టిమ్ సౌథీ.. 2008లో టెస్టు అరంగేట్రం చేసి 99 టెస్టులలో 378 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరుగనుంది. తొలి టెస్టులో కివీస్ దారుణ పరాభవం నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.