లండన్ : క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని, దేశం తరఫున ఆడేందుకు వచ్చారని టీమ్ఇండియా చీఫ్‌కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబసభ్యులు కలిసుండటంపై బీసీసీఐ నిబంధనలను ఈ సందర్భంగా గంభీర్ సమర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ఓటమి తర్వాత బీసీసీఐ ట్రావెల్ పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. 45 రోజులకు మించిన టూర్లో రెండు వారాల పాటు కుటుంబసభ్యులతో ఉండేందుకు బోర్డు అనుమతిచ్చింది.
ఈ నేపథ్యంలో గౌతీ స్పందిస్తూ ‘కుటుంబాలు అందరికీ కీలకమే, కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి మనం విహారయాత్రకు రాలేదు, ఒక ఉద్దేశంతో వచ్చాం. డ్రెస్సింగ్‌రూమ్‌లో కొద్ది మందికి దేశం గర్వపడేలా రాణించే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు నేను వ్యతిరేకం కాదు. ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఉన్నా.. మన లక్ష్యం వేరే అన్న సంగతి మరువకూడదు’ అని అన్నాడు.