WFI | ఢిల్లీ: ఇటీవలే ముగిసిన బిష్కెక్, ఇస్తాంబుల్ అర్హత టోర్నీలలో సత్తా చాటి పారిస్ ఒలింపిక్స్ బెర్తులు ఖాయం చేసుకున్న ఆరుగురు రెజ్లర్లకు భారీ ఊరట దక్కింది. ఈ రెజ్లర్ల కేటగిరీలలో మళ్లీ ట్రయల్స్ నిర్వహించబోమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ.. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపాడు.
ట్రయల్స్ వల్ల రెజ్లర్లు ఒకవేళ గాయాల బారిన పడితే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో ఆ ప్రయత్నాలను డబ్ల్యూఎఫ్ఐ విరమించుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల ఓ సీనియర్ రెజ్లర్ కోర్టుకు వెళ్లే అవకాశమున్నట్టు సమచారం. పారిస్ టికెట్ ఖాయం చేసుకున్న రెజ్లర్లలో వినేశ్ ఫోగట్ (50 కిలోలు), అంతిమ్ పంఘల్ (53 కిలోలు), అన్షు మాలిక్ (57 కిలోలు), నిషా దహియా (68 కిలోలు), రితికా హుడా (76 కిలోలు), అమన్ సెహ్రావత్ (57 కిలోలు) ఉన్నారు. ఒలింపిక్స్ ముందు మళ్లీ ట్రయల్స్ నిర్వహణ వద్దని వీరంతా డబ్ల్యూఎఫ్ఐకి ఇటీవలే లేఖ రాసిన విషయం విదితమే.