ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరుగుతున్న టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి మీసం మెలేశాడు. కంగారూల బౌలింగ్ ధాటికి సహచర బ్యాటర్లు విఫలమైన వేళ తన దమ్మేంటో క్రికెట్ ప్రపంచానికి చూపెడుతూ సాహసోపేత సెంచరీతో కదంతొక్కాడు. వాషింగ్టన్ సుందర్ జతగా ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో సూపర్ షాట్లతో అలరిస్తూ కెరీర్లో తొలి సెంచరీతో తన కలను సాకారం చేసుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి చారిత్రక ఇన్నింగ్స్‌తో మరుపురాని ఆటతీరుతో అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలో సుందర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో పాటు పిన్న వయసులో ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టిన క్రికెటర్‌గా నిలిచిన నితీశ్ ‘ఇక తగ్గేదేలే’ అంటూ గర్జించాడు. ఈ తెలుగు క్రికెటర్ వీరోచిత సెంచరీని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ప్రశంసించారు. భవిష్యత్తు కెప్టెన్ అని కితాబిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు.
191/6. మూడో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చే ముందు భారత్ స్కోరిది. ఇక మిగిలింది ఇద్దరే ప్రొఫెషనల్ బ్యాటర్లు. జోరు మీదున్న ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి మరో 30, 40 పరుగులు జోడించినా ఎక్కువే అనుకున్నారంతా..! మెల్బోర్న్ కూడా క్రమంగా చేజారిపోతోందేమోనన్న అనుమానం! దానిని నిజం చేస్తూ కొద్ది సేపటికే జడేజా వికెట్ రూపంలో టీమ్ఇండియాకు మరో షాక్. కానీ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో తన ముద్ర వేస్తున్న నితీశ్‌కు మరో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తోడవడంతో కథ పూర్తిగా మారింది. ఈ ఇద్దరూ ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తమ కెరీర్ ఆసాంతం గుర్తుంచుకునే చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. భీకర ఆసీస్ పేస్ దళాన్ని, దిగ్గజ స్పిన్నర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని అసాధారణ రీతిలో పోరాడారు. ఫాలోఆన్ గండాన్ని తప్పించుకుంటే గొప్ప అనుకునే స్థితి నుంచి బాక్సింగ్ డే టెస్టులో భారత్‌ను పోటీలోకి తెచ్చారు. ముఖ్యంగా 21 ఏండ్ల తెలుగు కుర్రాడు నితీశ్ వీరోచిత శతకమైతే నభూతో నభవిష్యత్..
Nitish Reddy | మెల్బోర్న్: తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఫాలోఆన్ గండాన్ని తప్పించుకోవడమే గాక మ్యాచ్‌పై పట్టు సాధించే ఆశలనూ మెరుగుపరుచుకుంది. నితీశ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50, 1 ఫోర్) చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించడమే గాక కంగారూల ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించారు. ఈ ఇద్దరి పోరాటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీశ్‌కు అండగా సిరాజ్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో టెస్టులు అంటే ఈడెన్ గార్డెన్లో లక్ష్మణ్, ద్రావిడ్ రికార్డు భాగస్వామ్యం.. కంగారూల గడ్డపై సచిన్, కోహ్లీ శతక గర్జన.. గబ్బాలో రిషభ్ పంత్ మెరుపులు.. గత రెండు పర్యటనలలో పుజారా డిఫెన్స్ గుర్తొస్తాయి. వీటికేమాత్రం తీసిపోకుండా మెల్బోర్న్లో నితీశ్, సుందర్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఓవర్‌నైట్ స్కోరు 164/5తో మూడోరోజు ఆట ఆరంభించిన భారత్.. ఆరంభంలోనే రిషభ్ (28) వికెట్‌ను కోల్పోయింది. సిరీస్‌లో చెత్త ఆటతో విమర్శల పాలవుతున్న పంత్.. మళ్లీ ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. స్కోరుబోర్డుపై మరో 30 పరుగులు చేరగానే జడేజా (17) కూడా నిష్క్రమించాడు. ఈ క్రమంలో వాషింగ్టన్‌తో జతకలిసిన నితీశ్.. ఎంసీజీలో కంగారూలకు కొరకరాని కొయ్యగా మారాడు.
ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా నిలకడ ప్రదర్శించాడు. క్రీజులో నిలదొక్కుకునేదాకా షాట్ల జోలికి పోలేదు. లియాన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన అతడు.. ఒక్కో పరుగును కూడగడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. మరో ఎండ్‌లో సుందర్ అతడికి పూర్తి సహకారం అందించాడు. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్.. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. లంచ్ తర్వాత స్టార్క్ వేసిన ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన నితీశ్.. తన కెరీర్లో తొలి అర్ధ శతకాన్ని 80 బంతుల్లో పూర్తిచేశాడు. మార్ష్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన అతడు.. లియాన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 90లలోకి వచ్చాడు. ఇదే ఓవర్లో సుందర్ 146 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. కానీ డ్రింక్స్ విరామం తర్వాత అతడు.. లియాన్ బౌలింగ్‌లోనే స్లిప్స్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో 127 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సుందర్ నిష్క్రమించే సమయానికి నితీశ్ 97 పరుగుల వద్ద ఉండగా కమిన్స్ మరుసటి ఓవర్లో బుమ్రాను ఔట్ చేశాడు. దీంతో అందర్లోనూ టెన్షన్ మొదలైంది. సిరాజ్ క్రీజులో ఉండగా నితీశ్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. కానీ సిరాజ్.. కమిన్స్ ఓవర్లో మూడు బంతులను కాపాడుకుని నితీశ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. బొలాండ్ వేసిన 115వ ఓవర్లో మూడో బంతిని మిడాన్ దిశగా బౌండరీ తరలించడంతో అతడి తొలి శతకం పూర్తయింది. అర్ధ శతకాన్ని పుష్ప ైస్టెల్ (తగ్గేదేలే)లో సెలబ్రేట్ చేసుకున్న ఈ గాజువాక కుర్రాడు.. సెంచరీని బాహుబలిలో ప్రభాస్ కత్తిమీద చేతిని పెట్టి ఠీవీగా కూర్చునే సీన్‌ను రిక్రియేట్ చేయడం అభిమానులను అలరించింది. నితీశ్ సెంచరీని ప్రత్యక్షంగా వీక్షించిన అతడి తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
1 ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ నితీశ్. గతంలో ఈ రికార్డు కుంబ్లే (87, 2008లో) పేరిట ఉంది.
2 8వ వికెట్‌కు ఆస్ట్రేలియాపై నితీశ్-సుందర్ నెలకొల్పిన భాగస్వామ్యం (127) రెండో అత్యుత్తమం. సచిన్-హర్భజన్ (129, 2008లో) ముందున్నారు.
3 ఆసీస్ గడ్డపై శతకాలు చేసిన అతి పిన్న వయస్కులలో నితీశ్ మూడోవాడు. సచిన్ (18 ఏండ్ల 256 రోజులు), పంత్ (21 ఏండ్ల 92 రోజులు).. నితీశ్ (21 ఏండ్ల 216 రోజులు) కంటే ముందున్నారు.
ఆస్ట్రేలియా: 474 ఆలౌట్
భారత్: 358/9 (నితీశ్ 105 నాటౌట్, వాషింగ్టన్ 50, బొలాండ్ 3/57, కమిన్స్ 3/86)