Nita Ambani | ముంబై: భారత క్రికెట్లో పాండ్యా బ్రదర్స్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుతో పాటు ఐపీఎల్లో గుర్తింపు రాకముందు ఈ సోదరులు పడ్డ కష్టాల గురించి ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్లో మాకు నిర్దేశిత బడ్జెట్ ఉంటుంది. కొత్త ఆటగాళ్లను గుర్తించేందుకు గాను మేం అప్పట్లో దేశవాళీ మ్యాచ్‌లు ఆడే వేదికలకు వెళ్లేవాళ్లం.
నేనూ మా బృందంతో కలిసి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు వెళ్లేదాన్ని. ఒకరోజు మా బృందం ఇద్దరు కుర్రాళ్లను తీసుకొచ్చింది. ఆ ఇద్దరూ బక్కపలచని శరీరంతో ఉన్నారు. నేను వాళ్లిద్దరితో మాట్లాడా. ఆర్థిక పరిస్థితుల కారణంగా గత మూడేండ్ల నుంచి తాము మ్యాగీ, నూడుల్స్ మాత్రమే తింటున్నామని వాళ్లు నాతో చెప్పారు. కానీ ఆట పట్ల వారికున్న నిబద్ధత, ఉత్సాహం, అభిరుచి, ఏదో సాధించాలనే తపన నన్ను ఆకట్టుకున్నాయి.
ఆ ఇద్దరే హార్దిక్, కృనాల్. 2015లో హార్దిక్‌ను మేం రూ. 10 లక్షల కనీస ధరతో కొనుగోలు చేశాం. కానీ ఇప్పుడతడు ముంబై ఇండియన్స్ సారథి’ అని తెలిపారు. ‘ఆ తర్వాత ఏడాదే మా బృందం మరో యువ క్రికెటర్‌ను మ్యా క్యాంప్‌నకు తీసుకొచ్చింది. అతడి బౌలింగ్ శైలి, బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉన్నాయి. అతడు బంతితో మాట్లాడతాడు. అతడెవరో కాదు. ప్రస్తుత టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా. రెండేండ్ల క్రితం మేం తిలక్వర్మనూ అలాగే గుర్తించాం. భారత జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే నర్సరీగా ముంబై ఇండియన్స్ మారింది’ అని ఆమె గర్వంగా చెప్పారు.