గయా(బీహార్): బీహార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం వేర్వేరు ఈవెంట్లలో మన రాష్ట్ర ప్లేయర్లు సత్తాచాటారు. మహిళల జిమ్నాస్టిక్స్‌లో నిశిక అగర్వాల్ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలతో అదరగొట్టింది. టెన్నిస్‌లో బసిరెడ్డి రిశితారెడ్డి స్వర్ణం, రజతం ఖాతాలో వేసుకోగా, లక్ష్మి సిరికి కాంస్యం దక్కింది. మహిళల ఫెన్సింగ్‌లో హురెన్ అదీబా కాంస్యం సొంతం చేసుకుంది.
జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ టేబుల్ ఈవెంట్లో నిశిక 12.33పాయింట్లతో పసిడి పతకంతో మెరిసింది. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో అనౌష్క పాటిల్(12.10), సారా రవూల్(11.70) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అదే జోరు కొనసాగిస్తూ అన్ఈవెన్ బార్స్‌లో నిశిక 9.700 స్కోరుతో కాంస్యం ఖాతాలో వేసుకోగా, బాలెన్సింగ్ బీమ్‌లో మరో కాంస్యం లభించింది.
మహిళల సింగిల్స్ ఫైనల్లో రిశితారెడ్డి 6-1, 2-6, 6-3తో ఐశ్వర్య జాదవ్(మహారాష్ట్ర)పై విజయంతో పసిడి దక్కించుకుంది. డబుల్స్ తుది పోరులో రిశిత, లక్ష్మి సిరితో కలిసి రజతం కైవసం చేసుకుంది. ఈ మధ్య నిలకడగా రాణిస్తున్న రిశిత ప్రస్తుతం జూనియర్ ఐటీఎఫ్ విభాగంలో తెలంగాణలో నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నది. దేశ వ్యాప్త ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 3వ ర్యాంక్‌లో ఉన్న రిశిత..అంతర్జాతీయంగా 177వ ర్యాంక్‌లో ఉంది.