బ్యాంకాక్ : భారీ బృందంతో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అండర్ 19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌నకు వెళ్లిన భారత్‌కు పతకాల పంట పండుతున్నది. ఆదివారం జరిగిన అండర్-19 విభాగంలో పలువురు బాక్సర్లు పతకాల రేసులో ఉండగా మహిళల కేటగిరీలో నిషా, ముస్కాన్ పసిడి పంచ్‌లు విసరగా మరో ఐదుగురు రజతాలు, ఇద్దరు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల కేటగిరీలో రాహుల్ స్వర్ణం నెగ్గాడు. మహిళల 54 కిలోల ఫైనల్లో నిషా.. 4-1తో చైనా బాక్సర్ సిరుయి యాంగ్‌ను చిత్తు చేసింది.
మరో ఫైనల్లో ముస్కాన్ (57 కిలోలు).. 3-2తో అయజాన్ ఎర్మెక్ (కజకిస్థాన్)ను ఓడించి దేశానికి రెండో స్వర్ణాన్ని అందించింది. ఇక పురుషుల 75 కిలోల ఫైనల్లో రాహుల్.. 4-1తో ముహమ్మదియాన్ యకుప్బెవెక్ (ఉజ్బెకిస్థాన్)ను మట్టికరిపించి ముచ్చటగా మూడో పసిడిని సాధించాడు. మొత్తంగా అండర్-19 విభాగంలో భారత్ 14 పతకాలు సాధించడం గమనార్హం. అండర్-22 విభాగంలోనూ భారత్ 13 పతకాలు ఖాయం చేసుకోగా సోమవారం నుంచి అందుకు సంబంధించిన ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.