న్యూఢిల్లీ : జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల 48-51కిలోల సెమీస్ బౌట్లో నిఖత్ 4-1తో కుసుమ్ బగేల్(ఉత్తరప్రదేశ్)పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ తన పంచ్ పవర్ ఏంటో రుచిచూపిస్తూ బౌట్ను ఏకపక్షంగా కైవసం చేసుకుంది.
70-75కిలోల సెమీస్ బౌట్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీన బొర్గోహై 5-0తో ఇమ్రోజ్ఖాన్(ఉత్తరప్రదేశ్)పై గెలిచి టైటిల్ పోరులో నిలిచింది. మిగతా బౌట్లలో ప్రపంచ చాంపియన్ మీనాక్షి(45-48కి) 5-0తో మలికా మోర్(మధ్యప్రదేశ్)పై, 51-54కిలోల కేటగిరీలో ప్రీతి 5-0తో ఆర్తీ దరియాల్పై గెలిచారు. పురుషుల 55-60కిలోల సెమీస్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ 4-1తో రామన్(ఏఐపీ)పై గెలిచి తుదిపోరులో నిలిచాడు.