Mr Olympia 2024 : కండలు తిరిగిన యోధుల పోటీల్లో నైజీరియా బాడీ బిల్డర్ శాంసన్ దౌడా (Samson Dauda) అదరగొట్టాడు. తన బలీయమైన దేహపుష్ఠితో ఈ ఏడాదికిగానూ ‘మిస్టర్ ఒలింపియా’ (Mr Olympia 2024)గా ఎంపికయ్యాడు. లాస్ వేగాస్లోని రిసార్ట్స్ వరల్డ్ థియేటర్ (Resorts World Theater)లో అక్టోబర్ 12న జరిగిన 60వ అంతర్జాతీయ పురుషుల బాడీ బిల్డింగ్ పోటీల్లో శాంసన్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఫైనల్ రౌండ్లో శాంసన్‌కు గట్టి పోటీ ఎదురైనా.. జడ్జిలు అతడి దేహ ప్రదర్శనకు జేజేలు కొడుతూ విజేతగా ప్రకటించారు. ఆ క్షణం శాంసన్ ప్రపంచాన్ని గెలిచినంతగా సంబురపడిపోయాడనుకో.
అంతేకాదండోయ్.. ఈ పోటీల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీ అందుకున్నాడు. నైజీరియా – బ్రిటీష్ దేశాల్లో బాడీ బిల్డర్‌గా పేరొందిన శాంసన్‌కు విజేతగా నిలిచినందుకు టైటిల్‌తో పాటు బహుమతిగా రూ. 5 కోట్లు దక్కాయి. మిస్టర్ ఒలింపియా చరిత్రలో ఇంత మొత్తం అందుకున్న తొలి వ్యక్తి శాంసనే కావడం విశేషం. టైటిల్ గెలుపొందిన అనంతరం శాంసన్ మిస్టర్ ఒలింపియా విగ్రహాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. దానికి ఇం’టికి వచ్చేస్తోంది’ అంటూ క్యాప్షన్ రాశాడు.
శాంసన్ సొంత దేశం, అతడు పుట్టింది నైజీరియాలోనే. అయితే.. యువకుడిగా ఉన్నప్పుడే అతడు లండన్‌కు వలస వెళ్లాడు. చిన్నప్పటి నుంచి అతడికి బాడీ బిల్డింగ్ అంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టమే అతడిని దేశం గర్వించే, ప్రపంచమంతా పొగిడే బాడీ బిల్డర్‌ను చేసింది. ఈ ఏడాది మిస్టర్ ఒలింపియా టైటిల్‌తో 32 ఏండ్ల శాంసన్ పేరు ఇంగ్లండ్ మొత్తం మార్మోగిపోతోంది.
ఎందుకంటే.. 1997 తర్వాత ఆ దేశస్థుడికి బాడీ బిల్డర్ అవార్డు రావడం ఇదే మొదటిసారి. అప్పుడు డొరియన్ యేట్స్ ఈ టైటిల్ సాధించాడు. శనివారం జరిగిన మిస్టర్ ఒలింపియా పోటీల్లో గత ఏడాది రన్నరప్ హడీ చూపన్ మళ్లీ రెండో స్థానంతోనే సరి పెట్టుకున్నాడు. ఇక.. నిరుడు విజేత డెరెక్ లున్స్ఫోర్డ్ మూడో స్థానంలో నిలిచాడు.