Geoff Allott : సుదీర్ఘ ఫార్మాట్లో ఎందరో పరుగుల వీరులను చూశాం. పది వికెట్లతో చెలరేగిన బౌలర్ల ఘనతను పొగిడాం. కానీ, సుదీర్ఘ సమయం క్రీజులో ఉండి డగౌట్ అయిన క్రికెటర్లు చాలా అరుదు. ఈ జాబితాలో ఆల్‌టైమ్ రికార్డును మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరు అంటే.. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు జెఫ్ అలాట్ (Geoff Allott ).
టెస్టుల్లో 77 బంతులు ఆడిన జెఫ్ సున్నాకే వెనుదిరిగాడు. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జెఫ్ ఈ రికార్డు సృష్టించాడు. దాదాపు 12 ఓవర్లకు పైగా సఫారీ బౌలర్లను విసిగించిన జెఫ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ 25 ఏండ్లు గడుస్తున్నా కివీస్ మాజీ ఆటగాడి పేరిట ఉన్న రికార్డు మాత్రం చెక్కు చెదరలేదు.
టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత కుర్రడు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal ) సైతం చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా సాగుతున్న మొదటి టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఔటయ్యాక మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన పడిక్కల్.. 22 బంతులాడాడు. అప్పటివరకూ ఖాతా తెరవని అతడు ఇక దంచేస్తాడులే అనుకున్న సమయంలోనే 23వ బంతికి వికెట్ పారేసుకున్నాడు. సున్నాకే ఔటయ్యాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతికి పడిక్కల్ దొరికాడు. అంతే.. తొలి మ్యాచ్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాలనుకున్న అతడి కల చెదిరింది.
Devdutt Padikkal departs for a duck 🦆
India – 14/2
📸: Disney+Hotstar#AUSvIND #DevduttPadikkal #BGT2024 pic.twitter.com/fJiEDgMs9u
— OneCricket (@OneCricketApp) November 22, 2024
పెర్త్ మైదానంలో టాస్ గెలిచిన భారత జట్టుకు షాకిస్తూ స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్‌లు వికెట్ల వేట కొనసాగించారు. సొంతగడ్డపై పెట్రేగిపోయిన ఈ పేస్ త్రయం టీమిండియాను 150కే ఆలౌట్ చేసింది. హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా.. స్టార్క్, కమిన్స్‌లు చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత జట్టును స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసిన ఆనందం ఆసీస్‌కు లేకుండా పోయింది. ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(417) సంచలన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడు. అతడికి తోడుగా సిరాజ్ సైతం విజృంభించడంతో ఆసీస్ ఎదురీదుతోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేసిన ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనకబడే ఉంది.