India Vs New Zealand | అహ్మదాబాద్: భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ మహిళల జట్టు తొలి వన్డేలో ఓడినా రెండో వన్డేలో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కివీస్ 76 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. ఆ జట్టు సారథి సోఫీ డెవిన్ బ్యాట్‌తో (86 బంతుల్లో 79, 7 ఫోర్లు, 1 సిక్సర్) పాటు బంతితో (3/27)నూ సత్తా చాటి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సూజీ బేట్స్ (58) రాణించింది. ఛేదనలో టాపార్డర్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్
అయింది. మొదట బంతితో (4/69) కివీస్‌ను కట్టడి చేయడమే గాక మూడు అధ్బుతమైన క్యాచ్‌లు పట్టిన యువ స్పిన్ ఆల్‌రౌండ్ రాధా యాదవ్.. బ్యాట్‌తోనూ (64 బంతుల్లో 48, 5 ఫోర్లు) పోరాడింది. పదో నెంబర్ బ్యాటర్ సైమా ఠాకూర్ (29)తో కలిసి పోరాడి భారత ఓటమి అంతరాన్ని తగ్గించింది. డెవిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఈనెల 29న ఇదే వేదికపై జరుగనుంది.
రాణించిన సూజీ, డెవిన్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. బేట్స్‌తో పాటు జార్జియా ప్లిమ్మర్ (41) తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఓవర్‌కు 6 రన్ రేట్‌కు తగ్గకుండా ఆడటంతో కివీస్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. దీప్తి శర్మ కివీస్‌ను తొలి దెబ్బ కొట్టింది. ప్లిమ్మర్‌ను 16వ ఓవర్లో ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారెన్ (3) రనౌట్ కాగా అర్ధ సెంచరీ తర్వాత బేట్స్‌ను రాధా యాదవ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపింది. బ్రూక్ (8) సైతం నిష్క్రమించడంతో ఆ జట్టు స్కోరు వేగం మందగించింది. ఈ క్రమంలో కెప్టెన్ డెవిన్, మ్యాడీ గ్రీన్ (42) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 82 వికెట్లు జతకూర్చడంతో పర్యాటక జట్టు భారత్ ఎదుట పోరాడే స్కోరును నిలపగలిగింది.
టాపార్డర్ వైఫల్యం
లక్ష్య ఛేదనలో భారత్ ఆది నుంచే తడబడింది. టాపార్డర్ బ్యాటర్లలో స్మృతి మంధాన ఎదుర్కున్న రెండో బంతికే ప్లిమ్మర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా షఫాలీ వర్మ (11)ను కెర్ వికెట్ల ముందు బలిగొంది. యస్తికా భాటియా (12), జెమీమా రోడ్రిగ్స్ (17) సైతం విఫలమవగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (24) కూడా అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకుంది. తేజల్ (15), దీప్తి (15) నిరాశపరిచారు.
రాధా, సైమా పోరాటం
108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాధా, సైమా ఠాకూర్ భారత్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరి పోరాటంతోనే ఆతిథ్య జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లను ఈ ఇద్దరూ 17 ఓవర్ల పాటు సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. గెలుపు మీద ఆశలు లేకున్నా ఈ ద్వయం ఏదైనా అద్భుతం చేయకపోతుందా? అని చూసిన భారత అభిమానుల ఆశలపై కెర్ నీళ్లు చల్లింది. ఆమె వేసిన 44వ ఓవర్లో ఆఖరి బంతిని షాట్ ఆడబోయిన సైమా.. బేట్స్ చేతికి చిక్కడంతో 70 పరుగుల 9వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. డెవిన్ 48వ ఓవర్లో రాధాను ఔట్ చేసి భారత ఇన్నింగ్స్‌ను ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 259/9 (డెవిన్ 79, బేట్స్ 58, రాధా 4/69, దీప్తి 2/30); భారత్: 47.1 ఓవర్లలో 183 ఆలౌట్ (రాధా 48, సైమా 29, డెవిన్ 3/27, తహుహు 3/42)