సొంతగడ్డపై భారత్‌కు భంగపాటు ఎదురైంది. పెట్టని కోటలాంటి పిచ్‌లపై ప్రత్యర్థి చేతిలో అనూహ్య ఓటమి పలుకరించింది. వరుణుడి అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా భారీ ఓటమి చవిచూసింది. జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఎంచుకోవడం వరకు అన్నింటా వైఫల్యాలు వెంటాడినా..వెరువకుండా పోరాడినా రోహిత్‌సేనకు ఫలితం దక్కలేదు. ఏదైనా అద్భుతం జరుగకపోతుందా అన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ 36 ఏండ్ల తర్వాత భారత్‌లో కివీస్ తొలి టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుని సంబురాలు చేసుకుంది. ఓపెనర్లు విఫలమైనా విల్‌యంగ్, రచిన్ రవీంద్ర జట్టును గెలుపు తీరాలకు చేర్చడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
Bengaluru Test | బెంగళూరు: సొంత ఇలాఖాలో తమకు తిరుగేలేదనుకున్న భారత్‌కు న్యూజిలాండ్ అనుకోని షాక్ ఇచ్చింది. అసలు టీమ్ఇండియాకు తిరుగుందన్న తరుణంలో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిని కివీస్..చారిత్రక విజయంతో కదంతొక్కింది. వర్షం అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.
నిర్దేశిత లక్ష్యఛేదన(107) కోసం దిగిన కివీస్..27.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. విల్ యంగ్(48 నాటౌట్), రచిన్ రవీంద్ర(39 నాటౌట్)రాణించారు. బుమ్రా (2/29) కు రెండు వికెట్లు దక్కాయి. సెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన రచిన్ రవీంద్రకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.ఈ విజయంతో కివీస్ 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య ఈనెల 24 నుంచి పుణెలో రెండో టెస్టు మొదలుకానుంది.
కివీస్ సమిష్టిగా: స్వల్ప లక్ష్యఛేదనలో కివీస్ సమిష్టిగా పోరాడింది. మైదానం తడిగా ఉండటంతో ఆదివారం ఉదయం నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా 10.15గంటలకు మ్యాచ్ మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే కెప్టెన్ టామ్ లాథమ్(0)డకౌట్‌గా వెనుదిరిగాడు. బుమ్రా స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని లాథమ్..డీఆర్ఎస్కు వెళ్లినా లాభం లేకపోయింది.
35 పరుగుల తేడాతో డెవాన్ కాన్వె(17)కూడా బుమ్రాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. 35 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను యంగ్, రచిన్ ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ లక్ష్యాన్ని కరిగించారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్యాదవ్, జడేజా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. బెంగళూరు టెస్టులో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం భారత్‌ను బాగా దెబ్బకొట్టింది. జడేజా బౌలింగ్‌లో యంగ్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేయడంతో కివీస్ జట్టు సంబురాల్లో మునిగిపోయింది. చివరిసారి 1988లో భారత్‌పై కివీస్ టెస్టు విజయం సాధించడం విశేషం.
భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఆలౌట్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402, భారత్ రెండో ఇన్నింగ్స్: 462, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 110/2 (యంగ్ 48 నాటౌట్, రచిన్ 39 నాటౌట్, బుమ్రా 2/29)