వెల్లింగ్టన్: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 26.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి విజయాన్నందుకుంది. దీంతో సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఓపెనర్ విల్యంగ్(90 నాటౌట్) అర్ధసెంచరీతో రాణించాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కివీస్ విజయంలో కీలకమయ్యాడు. విక్రమసింఘేకు ఏకైక వికెట్ దక్కింది. తొలుత మ్యాట్ హెన్రీ(4/19) ధాటికి లంక 43.4 ఓవర్లలో 178 పరుగులకు కుప్పకూలింది. జట్టులో అవిష్క ఫెర్నాండో(56), జనిత్(36), హసరంగ(35) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. నాలుగు వికెట్లతో విజృంభించిన హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.