సిడ్నీ: నిరుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. ఎస్సీజీ వేదికగా శనివారం జరిగిన సూపర్-12 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2011 తర్వాత ఆసీస్ గడ్డపై కంగారూలను ఓడించడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది.
కాన్వే (58 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలువగా.. ఫిన్ అలెన్ (16 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఆసీస్ బౌలర్లలో హజిల్వుడ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఆసీస్ 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కాన్వేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించింది. మొదట అఫ్గాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహిం (32), ఉస్మాన్ (30) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం చేజింగ్‌లో ఇంగ్లిష్ జట్టు 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 రన్స్ చేసింది.