దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెస్టుల్లో స్టాప్‌క్లాక్ తీసుకొచ్చిన ఐసీసీ..తాజాగా కాంకషన్ ప్లేయర్స్‌తో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వైడ్‌బాల్స్ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఏ ప్లేయర్ అయినా మ్యాచ్ సందర్భంగా కాంకషన్ బారిన పడితే కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే తిరిగి జట్టులోకి రావాలని ఐసీసీ స్పష్టం చేసింది. దీనికి తోడు హోమ్ టీమ్‌కు అనుకూలంగా కాకుండా ప్రతీ మ్యాచ్‌కు ముందు కాంకషన్ రిప్లేస్మెంట్ ప్లేయర్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా తమకు అనుకూలమైన ప్లేయర్‌ను తీసుకునే అవకాశం జట్లకు లేకుండా పోతుంది.
మ్యాచ్‌లో ఎవరైనా కాంకషన్‌కు గురైనట్లు నిర్ధారణ అయితే కచ్చితంగా వారం రోజులకు తగ్గకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని ఐసీసీ తెలిపింది. మెడికల్ అడ్వజరీ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వివరించింది. మరవైపు బౌలింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్ స్థానాన్ని బట్టి ఇక నుంచి వైడ్ ఇవ్వనున్నారు. పాత నిబంధనల్లో మార్పులు చేస్తూ బ్యాటర్ పొజిషన్‌కు అనుగుణంగా వైడ్‌ను ప్రకటించనున్నారు. ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయని ఐసీసీ పేర్కొంది.