ఢిల్లీ: మెగా టోర్నీని ఓటమితో ఆరంభించిన నెదర్లాండ్స్.. రెండో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. ఆ జట్టు ఆటగాడు బాస్ డి లీడ్ ఆల్‌రౌండ్ షో తో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ -8 ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో ప్రత్యర్థిని 156/8 పరుగులకే కట్టడి చేసిన ఆ జట్టు.. ఛేదనను మరో రెండు ఓవర్లు మిగిలుండగానే దంచేసింది. బంతితో రెండు వికెట్లు (2/20) పడగొట్టిన బాస్.. బ్యాట్‌తో (42 బంతుల్లో 72 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు)నూ రెచ్చిపోయాడు.
అతడికి అండగా కొలిన్ అకర్మన్ (32) రాణించడంతో డచ్ జట్టు ఈ టోర్నీలో బోణీ కొట్టింది. ఛేదనలో 46 రన్స్‌కే ఓపెనర్లను కోల్పోయినా ఆ జట్టు.. లీడ్, కొలిన్ మెరుపులతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు లీడ్, వాన్ బీక్ (2/13)కు తోడు డచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియాకు పరుగుల రాక గగనమైంది. ఆ జట్టులో నికోల్ లాఫ్టి (42) టాప్ స్కోరర్ కాగా ఫ్రైలింక్ (30) ఫర్వాలేదనిపించాడు.