Sandeep Lamichchane : అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నేపాల్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అతడిపై విధించిన నిషేధాన్ని నేపాల్ క్రికెట్ బోర్డు ఎత్తేసింది. ‘మంగళవారం రాత్రి పొఖరాలో జరిగిన నేపాల్ క్రికెట్ ఆసోసియేషన్ (సీఏఎన్) సమావేశంలో సందీప్‌పై నిషేధాన్నిఎత్తి వేయాలని నిర్ణయం తీసుకున్నాం. మిగతా వివరాలను ఈ రోజు వెల్లడిస్తాం’ అని సీఎఎన్ అధికారి బీరెంద్ర బహదూర్ ఛందా తెలిపాడు. దాంతో స్వదేశంలో ఈ నెలాఖరున జరగనున్నవరల్డ్ కప్ లీగ్ ట్రై సిరీస్‌లో అతను ఆడేందుకు మార్గం సుగమం అయింది. నమీబియా, స్కాంట్లాండ్ సిరీస్‌లో ఆడనున్నాయి. అయితే.. అత్యాచార నిందుతడు అయిన సందీప్ లమిచానేకు బెయిల్ ఇవ్వడాన్ని ఆటార్నీ జనరల్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. ఖాట్మండ్ జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపి వేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
షరతులతో కూడిన బెయిల్
17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో సందీప్ పోయిన ఏడాది అరెస్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 8న అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దాంతో, నేపాల్ క్రికెట్ బోర్డు అతడిపై నిషేధం విధించింది. అయితే.. ఆ సమయంలో సందీప్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో జమైకా తల్లవాహ్స్ జట్టుకు ఆడుతున్నాడు. సందీప్ అక్టోబర్ 6న స్వదేశానికి తిరిగొచ్చాడు. వచ్చిన వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అక్కడి పటాన్ హైకోర్టు సందీప్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. స్వదేశంలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో ఆడేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే.. వీదేశీ పర్యటనలో సందీప్ అడేది లేనిది ఇప్పుడే చెప్పలేమని సీఏఎన్ జనరల్ మేనేజర్ బ్రితంక్ ఖనల్ అన్నాడు. ‘సందీప్ ప్రస్తుతానికి జట్టులో సభ్యుడు అంతే. అతను విదేశీ పర్యటనలో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే అతను విదేశీ టూర్‌కు వెళ్తాడు’ అని బ్రితంక్ వెల్లడించాడు.