ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో భారత పతక జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. ‘ఇస్ బార్ సౌ పార్’ అన్న నినాదాన్ని చేతల్లో చూపెట్టేందుకు అథ్లెట్లు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లో తెలుగు ఆర్చర్ జ్యోతిసురేఖ, ఓజాస్ దేవ్‌తలె జోడీతో మొదలైన పసిడి జోరు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో పదకొండో రోజు ఘనంగా ముగిసింది. మొత్తం 12 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్..సుదీర్ఘ ఆసియాగేమ్స్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. పురుషుల రిలే టీమ్‌ఈవెంట్‌లో భారత్ తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటే మహిళలను రజతంతో తళుక్కుమన్నారు. అవినాశ్ సాబ్లె, హర్మిలన్ వెండి వెలుగులు విరజిమ్మారు.
హాంగ్జౌ: ఆసియాగేమ్స్‌లో భారత్ తమదైన దూకుడు కనబరుస్తున్నది. రోజురోజుకు తమ పతక ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ ముందుకెళుతున్నది. పోటీలకు పదకొండో రోజైన బుధవారం భారత్ ఖాతాలో ఏకంగా డజను పతకాలు వచ్చి చేరాయి. మొదటగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత స్టార్ ప్లేయర్ వెన్నెం జ్యోతి సురేఖ, ఓజాస్ దేవ్‌తలె జోడీ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆసియాగేమ్స్‌లో సురేఖకు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 159-158తేడాతో కొరియాపై ఉత్కంఠ విజయం సాధించింది.
రిలేలో భారత అథ్లెట్లు దుమ్మురేపారు. పురుషుల 4X400మీ రిలే రేసులో మహమ్మద్ అనాస్, జాకబ్ అమోజ్, మహమ్మద్ అజ్మల్, రమేశ్ రాజేశ్‌తో కూడిన భారత బృందం 3:01:58సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకాన్ని తిరిగి దక్కించుకుంది. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన ఈ నలుగురు అథ్లెట్లు రిలేలో భారత రికార్డును పదిల పరిచారు. మహిళల రిలే పరుగులో విత్య రామరాజ్, ఐశ్వర్య, ప్రాచి, సుభా వెంకటేశన్‌తో కూడిన జట్టు 3:27:85సెకన్ల టైమింగ్‌తో రజతం సొంతం చేసుకుంది. 35కి.మీల రేస్ వాక్‌లో మంజు రాణి, బాబు రామ్ జోడీ కాంస్యం ముద్దాడింది. మహిళల 800మీ ఫైనల్లో హర్మిలన్ బైన్స్ వెండి పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల 5000మీ ఫైనల్లో అవినాశ్ సాబ్లె రెండో స్థానంతో రజతం సొంతం చేసుకున్నాడు. పోటీలకు 11వ రోజైన బుధవారం భారత్‌కు 3 స్వర్ణాలు సహా ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు లభించాయి.
జకార్తా(2018) ఆసియాగేమ్స్ పతక రికార్డు(70)ను భారత్ దిగ్విజయంగా అధిగమించింది. పోటీలకు మరో నాలుగు రోజులు మిగిలున్న ఆసియాగేమ్స్‌లో భారత్ ప్రస్తుతం 81 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 18 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఇన్నేండ్ల ఆసియాగేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
స్కాష్‌లో భారత్‌కు కనీసం వెండి పతకం ఖాయమైంది. సౌరవ్ ఘోషాల్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్లో ప్రవేశించాడు. రెండో సీడ్ సౌరవ్ సెమీఫైనల్లో 11-2, 11-1, 11-6 పాయింట్ల భారీ తేడాతో లూయెంగ్ చి హిన్ హెన్రీని 32 నిమిషాల్లోనే చిత్తు చేశాడు.
పురుషుల జావెలిన్ త్రోలో భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, జెనా కిషోర్ కుమార్ హోరాహోరీగా తలపడ్డారు. ఓవైపు భారీ అంచనాల మధ్య నీరజ్ బరిలోకి దిగితే..అసలు పోటీలోనైనా నిలుస్తాడా అనుకున్న కిషోర్‌కుమార్ అదరగొట్టాడు. సాంకేతిక సమస్యల కారణంగా నీరజ్ వేసిన తొలి త్రో వృథా కాగా, కిషోర్‌కుమార్ తన నాలుగో ప్రయత్నంలో 87.54మీటర్ల దూరం విసిరాడు. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టైటిళ్లతో జావెలిన్కింగ్లా వెలుగొందుతున్న నీరజ్ 88.88మీటర్లతో పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇలా మన దేశానికే చెందిన ఇద్దరు ప్లేయర్లు స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు.
రెజ్లింగ్‌లో ప్రత్యేకమైన గ్రీకో రోమన్ పోటీలో భారత స్టార్ సునీల్ కుమార్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 87 కిలోల విభాగంలో సునీల్ తన ఉడుం పట్టుతో కాంస్యం దక్కించుకున్నాడు. కిర్జిస్థాన్ రెజ్లర్ అతబెక్ అజిస్బెకోవ్తో జరిగిన హోరాహోరీ పోరులో 2-1తో విజయ ఢంకా మోగించాడు. దాంతో, 13 ఏళ్ల తర్వాత ఈ పోటీలో పతకం గెలిచిన భారత రెజ్లర్‌గా సునీల్ చరిత్ర పుటల్లోకెక్కాడు.