జురిచ్ (స్విట్జర్లాండ్) : డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్.. 85.01 మీటర్లు విసిరి రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచాడు. జర్మనీ అథ్లెట్ జులియన్ వెబర్.. 91.57 మీ. రికార్డు త్రో తో అగ్రస్థానంలో నిలిచి తన కెరీర్లో తొలి డైమండ్ లీగ్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో అతడు రెండుసార్లు 90 మీ. మార్కును దాటడం విశేషం. వ్యక్తిగతంగానూ వెబర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
మొదటి త్రోను 91.37 మీటర్లు విసిరిన అతడు.. రెండో త్రోను 91.57 మీ. వేశాడు. చోప్రా విషయానికొస్తే.. మొదటి త్రో ను 84.35 మీ. వేసిన చోప్రా.. ఆ తర్వాత 82 మీ. కే పరిమితమయ్యాడు. మూడు, నాలుగు, ఐదో త్రోలను ఫౌల్ వేశాడు. అప్పటికే ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ కెష్రోన్ వాల్కట్ (84.95 మీ.)తో రెండో స్థానానికి దూసుకురాగా నీరజ్ మూడో స్థానానికి పడిపోయాడు. కానీ ఆరో ప్రయత్నంలో అతడు జావెలిన్‌ను 85.01 మీ. విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. కెష్రోన్ కాంస్యం గెలుచుకున్నాడు.