లండన్: టోక్యో విశ్వక్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించి చరిత్రకెక్కిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక లారెస్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ప్రతి ఏటా ప్రకటించే లారస్ ‘వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో ఈసారి 23 ఏండ్ల నీరజ్ నిలిచాడు. ఈ అవార్డు కోసం నీరజ్‌తో పాటు టెన్నిస్ స్టార్లు డానిల్ మెద్వెదెవ్, ఎమ్మా రదుకాను సహా మొత్తం ఆరుగురు పోటీ పడుతున్నారు. ఈ అవార్డుకు భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వినేశ్ ఫొగట్ తర్వాత నామినేట్ అయిన మూడో వ్యక్తి నీరజ్. 2020లో ఈ అవార్డును సచిన్ దక్కించుకోగా.. ఇప్పుడు నీరజ్ పొందే అవకాశం ఉంది. ‘టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనతో నన్ను ప్రపంచం గుర్తించడం గర్వంగా ఉంది. మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను నిరంతరం ఆటపైనే దృష్టి సారించా. అందుకే ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచా. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రపంచ వేదికలపై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా’ అని నీరజ్ పేర్కొన్నాడు.