Neeraj Chopra : వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్(World Athletics Championship)లో స్వర్ణం నెగ్గిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) అంటే.. భావి తరాలకు మార్గదర్శనం అని పలువురు మంత్రులు, అధికారులు నీరజ్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ సమయంలోనే నీరజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ అనంతరం నీరజ్ వివాహం జరిపించాలని భావిస్తున్నట్లు అతడి మేనమామ వెల్లడించాడు. అతడి అనుమతి లభిస్తే.. పెండ్లికి అన్ని ఏర్పాట్లు చేసేందుకు కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు.
‘నీరజ్ సమ్మతి కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు అతడి కోసం అమ్మాయిని వెతకలేదు. ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ఉంటే మాకు చెప్పమని కూడా నీరజ్‌తో అన్నాం’ అని అతడి మేనమామ భీమ్ చోప్రా(Bhim Chopra) తెలిపాడు. దీంతో ఈ వార్త కాస్తా వైరల్‌గా మారింది. అచ్చం బాలీవుడ్ హీరోను పోలి ఉండే నీరజ్ కేవలం ట్రాక్‌పైనే కాకుండా.. పలు యాడ్స్‌లో తన నటనతోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ను పెళ్లాడే ఆ అదృష్టవంతురాలు ఎక్కడుందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నీరజ్ చోప్రా
రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో పసిడి పతకం పట్టి ఆ ఘనత సాధించిన భారత తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చరిత్ర సృష్టించాడు. తాజాగా బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. 23 ఏండ్ల వయసులోనే ఒలింపిక్ చాంపియన్ అయిన నీరజ్ ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. అంతే.. హర్యానాలోని అతడి కుటుంబంలో సంబురాలు మిన్నంటాయి.