బెంగళూరు: దేశ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది! జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టి తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ‘గోల్డెన్బాయ్’ నీరజ్‌చోప్రా సొంతగడ్డపై మెరుపులు మెరిపించబోతున్నాడు. శనివారం స్థానిక కంఠీరవ స్టేడియం వేదికగా నీరజ్‌చోప్రా(ఎన్సీ) క్లాసిక్ జావెలిన్ త్రో కాంపిటీషన్ జరుగనుంది. వరల్డ్ అథ్లెటిక్స్ సహకారంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ పోటీ జరుగుతున్నది.
దాదాపు ఏడాది తర్వాత సొంత ఇలాఖాలో పోటీపడతున్న నీరజ్.. తన పేరిట జరుగబోతున్న టోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నాడు. డబుల్ ఒలింపిక్ మెడల్స్‌తో పాటు డైమండ్ లీగ్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనదైన రీతిలో పతకాలు కొల్లగొడుతున్న నీరజ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశముంది.
అండర్సన్ పీటర్స్, జులియన్ వెబర్ లాంటి స్టార్ల గైర్హాజరీలో నీరజ్ టైటిల్ ఫెవరేట్‌గా కనిపిస్తున్నాడు. భారత్ నుంచి నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యశ్విర్సింగ్, రోహిత్‌యాదవ్, సాహిల్ సిల్వాల్ బరిలో ఉన్నారు.