హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నేషనల్ ర్యాంకింగ్ టోర్నీ మంగళవారం మొదలైంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నాం’ అని అన్నారు. ఈనెల 23 వరకు జరిగే టోర్నీలో 26 రాష్ర్టాల నుంచి 330 మంది స్విమ్మర్లు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, స్విమ్మింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.