న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో.. జాతీయ క్రీడా పరిపాలన బిల్లు(National Sports Governance Bill)ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బహుళ దేశాలు పాల్గొనే ఈవెంట్లలో భాగంగా ఇండియాలో జరిగే టోర్నీలకు వచ్చే పాకిస్థాన్ అథ్లెట్లను అడ్డుకోబోమని ఆయన స్పష్టం చేశారు. క్రీడా బిల్లుకు సంబంధించిన సమగ్రమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధుల అంశాన్ని ఆ బిల్లులో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. క్రీడా నిర్వహణదారుల కోసం రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యున్నతమైన పరిపాలనా, ఆర్థిక, నైతిక ప్రమాణాలు పాటించే రీతిలో ఆ బోర్డు వ్యవహరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో సంబంధాలు సరైన రీతిలో లేకున్నా.. భారత్‌కు వచ్చే ఆ దేశ క్రీడాకారుల్ని అడ్డుకోబోమన్నారు.