హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్కేటర్లు పతక జోరు కనబరిచారు. వేర్వేరు విభాగాల్లో రాష్ర్టానికి చెందిన అనుపోజు కాంతిశ్రీ పసిడి పతకంతో మెరువగా, మోక్షిత్ రామ్‌రెడ్డికి స్వర్ణం, రజతం, రాధె లోయా, చింతల సాన్వి, కామినేని శౌనిక్రెడ్డి రజత పతకాలతో మెరిశారు. శుక్రవారంతో ముగిసిన టోర్నీలో మహిళల సీనియర్ క్యాటగిరీ సొలో డ్యాన్స్‌లో కాంత్రిశ్రీ పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. ఐదేండ్ల ప్రాయంలోనే స్కేటింగ్లోకి ప్రవేశించిన కాంతిశ్రీ ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించింది. మరోవైపు బాలుర రోలర్ ఫ్రీస్టయిల్ స్ట్రీట్, పార్క్ ఈవెంట్లో రామ్‌రెడ్డి రెండు పతకాలతో సత్తాచాటాడు. బాలిక రోలర్ ఫ్రీస్టయిల్ పార్క్ విభాగంలో రాధె రెండో స్థానంలో నిలువగా, స్కేట్‌బోర్డింగ్‌లో సాన్వి వెండి పతకం సొంతం చేసుకుంది. బాలుర స్కేట్బోర్డింగ్ స్ట్రీట్ ఈవెంట్లో శౌనిక్రెడ్డి మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రజతం కైవసం చేసుకున్నాడు.