న్యూఢిల్లీ: హాంగ్జౌ(చైనా) ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్సింగ్ నయా రికార్డు నెలకొల్పాడు. బోస్టన్ వేదికగా జరిగిన బీయూ డేవిడ్ హెమ్రె వాలెంటైన్ ఇన్విటేషనల్ టోర్నీలో గుల్వీర్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
పురుషుల 3000మీటర్ల ఇండోర్ రేసును గుల్వీర్ 7:38:26సెకన్లలో ముగించి 16 ఏండ్ల క్రితం సురేందర్సింగ్(7:49:47సె) రికార్డును తిరుగరాశాడు. చివరివరకు ఆసక్తికరంగా సాగిన రేసులో గుల్వీర్ రెండో స్థానంతో ముగించాడు. బోస్టన్ రాణించడం ద్వారా ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం లభించనుంది. ఇదిలా ఉంటే త్వరలో జరుగనున్న ఆసియా, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం స్కాట్ సిమన్స్ నేతృత్వంలో భారత అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.