హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీకి హైదరాబాద్ వేదికగా కాబోతున్నది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత పాంత్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 30 జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లు జాతీయ సంఘానికి లేదా ఆతిథ్య తెలంగాణ అసోసియేషన్‌కు సమాచారమందించాలని భారత హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు శనివారం పేర్కొన్నారు. సరూర్‌నగర్ స్టేడియం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన తెలిపారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) మార్గదర్శకాలను అనుసరించి కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని మీడియాకు జగన్ వివరించారు.