బెంగళూరు: ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్లు నందిని, భాగ్యలక్ష్మి, నిత్య కాంస్య పతకాలతో మెరిశారు. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి నందిని 13.85సె టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. టైమింగ్ పరంగా రెండో స్థానంలో నిలిచిన సప్నా కుమారి (13.85సె)తో సమంగా నిలిచినా..నందినికి నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో ఏపీకి చెందిన యర్రాజీ జ్యోతి (13.44సె) పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 800మీటర్ల ఫైనల్లో ఎస్సీ గురుకుల విద్యార్థి భాగ్యలక్ష్మి 2:15:40 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది. మరోవైపు మహిళల 100మీటర్ల ఫైనల్లో నిత్య కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. పతక విజేతలను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించాడు.