ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 02:40:02

ఆటే..శ్వాసగా

ఆటే..శ్వాసగా

  • హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి కృషి చేస్తా.. 
  • ‘నమస్తే తెలంగాణ’తో హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: యువ కెరటాలను సానబెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధించేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యం అని జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశెనపల్లి జగన్‌మోహన్‌రావు అన్నారు. నేషనల్‌ క్యాంప్‌లు, అకాడమీల ఏర్పాటుతో ఆ దిశగా అడుగులు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన హెచ్‌ఎఫ్‌ఐ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన జగన్‌మోహన్‌రావు.. జాతీయ క్రీడా సమాఖ్యకు అధ్యక్షుడైన తొలి తెలంగాణ వాసిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో దేశంలో హ్యాండ్‌బాల్‌ పరిస్థితి, తెలంగాణ క్రీడా రంగ ప్రగతిపై జగన్‌మోహన్‌రావు ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

తొలి అడుగులు..

పాఠశాల దశ నుంచి ఆటలపై మక్కువ పెంచుకున్న నేను.. అదే అసక్తితో వివిధ క్రీడా సంఘాల్లో పనిచేశా. తెలంగాణ టీ20 క్రికెట్‌ లీగ్‌, ముంబై క్రికెట్‌ లీగ్‌, ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీల్లో జట్లను కొనుగోలు చేశా. టీ స్పోర్ట్స్‌ హబ్‌ క్రీడా సంస్థను స్థాపించి ప్రతిభ గల క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతోపాటు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఉచిత విద్యనందిస్తున్నా. 29 రాష్ర్టాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో గల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషాన్నిచ్చింది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మౌలిక సదుపాయాలు పెంచడంతోపాటు ఇండోర్‌ స్టేడియాల నిర్మాణానికి కృషిచేస్తా. 

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది

రాష్ర్టాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం బలంగా సంకల్పిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌కు పుట్టినిళ్లుగా మారింది. బ్యాడ్మింటన్‌లాగే ఇతర క్రీడల్లోనూ రాణించే విధంగా 150 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ రూపకల్పన జరుగుతున్నది. త్వరలోనే స్పోర్ట్స్‌ పాలసీని కూడా తీసుకురానున్నారు. హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు కృషిచేస్తా. 

డిసెంబర్‌లో పీహెచ్‌ఎల్‌

మన దేశంలో క్రికెట్‌, బ్యాడ్మింటన్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. వాటి బాటలోనే హ్యాండ్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా.  ఈ ఏడాది జనవరిలోనే ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) జరుగాల్సింది. ఆరు జట్లలో తెలంగాణ టైగర్స్‌ జట్టును కొనుగోలు చేశాం.  కొవిడ్‌-19 కారణంగా వా యిదా పడ్డ లీగ్‌ను డిసెంబర్‌ 25 నుంచి నిర్వహిస్తాం.