స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తొలిసారి (2005) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గే సమయానికి.. అప్పుడప్పుడే రాకెట్ పట్టడం నేర్చుకుంటున్న ఆరేండ్ల బుడతడైన కాస్పర్ రూడ్.. మట్టికోటలో తన ఆరాధ్య ఆటగాడికి ఎదురు నిలువలేకపోయాడు! పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రూడ్‌ను చిత్తు చేసిన నాదల్.. ఓపెన్ ఎరాలో మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో పద్నాలుగోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పట్టాడు. రోజర్ ఫెదరర్ గైర్హాజరీలో సమీప ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌ను క్వార్టర్స్‌లోనే ఇంటి ముఖం పట్టించిన నాదల్.. మట్టికోటలో మరోసారి గర్జించాడు. బలమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లలో వార్ వన్‌సైడ్ చేసిన నాదల్.. ఓవరాల్‌గా 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు!
పారిస్: మట్టికోటలో తనకు తిరుగులేదని రఫేల్ నాదల్ (స్పెయిన్) మరోసారి నిరూపించుకున్నాడు. ఒకవైపు మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నా.. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరిన స్పెయిన్ బుల్.. రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పట్టాడు. శుక్రవారం 36వ పుట్టినరోజు జరుపుకున్న నాదల్ ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-3, 6-0తో కాస్పర్ రూడ్ (నార్వే)ను చిత్తు చేశాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి అగ్రభాగాన కొనసాగుతున్న నాదల్.. ఇప్పుడా సంఖ్యను 22కు పెంచుకుంటే.. సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) చెరో 20 టైటిల్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభానికి ముందు ముగ్గురు ప్లేయర్లు సమ ఉజ్జీలుగా ఉండగా.. 2022లోనే రెండో టైటిల్‌తో నాదల్ వారిద్దరినీ దాటేసి ముందంజ వేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన 14 సార్లు నాదలే విజేతగా నిలువగా.. ఓవరాల్‌గా 115 మ్యాచ్‌ల్లో 112 వాటిలో గెలుపొందడం విశేషం.
తనకు పెట్టని కోట వంటి రోలాండ్ గారోస్‌లో నాదల్ సింహగర్జన చేస్తే.. నార్వే నుంచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన రూడ్ కనీస పోటీనివ్వలేక చూస్తుండిపోయాడు. విజేతగా నిలిచిన నాదల్కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు).. రన్నరప్ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు గంటలా 18 నిమిషాల పాటు సాగిన పోరులో ఒక ఏస్ సంధించిన నాదల్.. 37 విన్నర్లతో సత్తాచాటితే.. మూడు ఏస్‌లు బాదిన రూడ్ 16 విన్నర్లకే పరిమితమయ్యాడు. నాదల్ 18 అనవసర తప్పిదాలు చేస్తే.. 26 తప్పిదాలతో రూడ్ మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో నాదల్కు కాస్త పోటీనిచ్చిన రూడ్.. రెండో సెట్ 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. ఇక అక్కడి నుంచి వరుసగా 11 గేమ్‌లు నెగ్గిన స్పెయిన్ బుల్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విశ్వరూపం కనబర్చాడు. ప్రిక్వార్టర్స్‌లో ఫెలిక్స్ అగర్‌పై విజయం సాధించిన నాదల్.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌ను చిత్తు చేశాడు. సెమీస్‌లో రెండు సెట్ల అనంతరం జ్వెరెవ్ గాయం కారణంగా వాకొవర్ ఇవ్వడంతో ఫైనల్ చేరిన స్పెయిన్ బుల్.. తుదిపోరులో రూడ్‌ను మట్టకరిపించాడు. వీరంతా టాప్ 10 ర్యాంకర్స్ కావడం గమనార్హం.
రన్నరప్ గాఫ్ జోడీ..
మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌కు డబుల్స్‌లోనూ నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో గాఫ్-జెస్సికా పెగులా జోడీ 6-2, 3-6, 2-6తో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాదెనోవిక్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మొదటి సెట్‌ను అలవోకగా నెగ్గిన అమెరికా జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ప్రైజ్ మనీ
విజేత: నాదల్ రూ.18.30 కోట్లు
రన్నరప్: రూడ్ రూ. 9.15 కోట్లు
అత్యధిక గ్రాండ్‌స్లామ్ వీరులు
మట్టికోటలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా నాదల్ చరిత్రకెక్కాడు.