ముంబై: భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(Musheer Khan)కు రోడ్డు ప్రమాదం అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆ యాక్సిడెంట్లో అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అతని తండ్రి నౌషాద్ ఖాన్ కూడా అతనితోనే ఉన్నాడు. ముషీర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్. ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా సీ జట్టు తరపున ఆడి 181 రన్స్ స్కోర్ చేశాడు. ఇప్పటి వరకు అతను 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.
ప్రమాదానికి గురైన 19 ఏళ్ల ముషీర్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నాడు. కానీ యాక్సిడెంట్ వల్ల అతను అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరగాల్సిన మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇక అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న రంజీ సీజన్‌కు కూడా అతను మిస్సయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడకు గాయం కావడం వల్ల అతను కనీసం మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తెలుస్తోంది.
ఇరానీ కప్ కోసం లక్నోకు వెళ్లిన ముంబై జట్టుతో అతను ట్రావెల్ చేయలేదు. ఆజంఘర్ నుంచి అతను తండ్రితో కలిసి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఫస్ట్ క్లాస్ సీజన్లో రాణిస్తున్న ముషీర్.. గాయం వల్ల ఆస్ట్రేలియాలో జరిగే ఇండియా ఏ జట్టు మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియా ఏ జట్టును ఎంపిక చేస్తారు.