IPL | ఢిల్లీ: ఐపీఎల్-18లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు సీజన్లో తొలి షాక్. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40) రాణించారు. ఛేదనలో ఢిల్లీ లక్ష్యానికి దగ్గరిదాకా వచ్చినా.. 19 ఓవర్లలో 195 పరుగుల వద్దే ఆగిపోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89, 12 ఫోర్లు, 5 సిక్సర్లు), పొరెల్ (25 బంతుల్లో 33) పోరాడినా ఆఖర్లో ముంబై బౌలర్లు రాణించడంతో క్యాపిటల్స్‌కు తొలి ఓటమి తప్పలేదు.
భారీ ఛేదనలో తొలి బంతికే మెక్‌గర్క్ డకౌట్‌గా వెనుదిరిగినా ముకేశ్ కుమార్ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన నాయర్.. బౌల్ట్ రెండో ఓవర్లో 3 బౌండరీలు బాది తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. బుమ్రా సైతం కరుణ్ బాదుడుకు బాదితుడిగా మిగిలాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు 4, 4, 6, 4, 6 బాది 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఏడేండ్ల తర్వాత ఐపీఎల్లో అతడికిదే తొలి అర్ధశతకం. అతడిని ఔట్ చేసేందుకు హార్దిక్ పదే పదే బౌలర్లను మార్చినా బంతిని అందుకున్న ప్రతి ఒక్కరూ కరుణ్ బాధితులుగానే మిగిలారు. అయితే శతకానికి సమీపిస్తున్న తరుణంలో శాంట్నర్ 12వ ఓవర్లో అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక్కడే మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. రోహిత్ స్థానంలో ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ.. పొరెల్, స్టబ్స్ (1), రాహుల్ (15)ను ఔట్ చేసి ముంబైని గెలుపు రేసులోకి తెచ్చాడు. ఆ తర్వాత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి తొలి ఓటమి ఎదురైంది.
గత మ్యాచ్‌లతో పోలిస్తే ముంబై బ్యాటర్లు సమిష్టిగానే రాణించారు. రోహిత్ (18) మరోసారి నిరాశపరిచినా రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 5 ఓవర్లలోనే 47 పరుగులు జోడించడంతో ముంబైకి శుభారంభమే లభించింది. దూకుడుగా ఆడిన రికెల్టన్ను కుల్దీప్ 8వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్‌తో కలిసి సూర్య ముంబైని నడిపించాడు. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీగా మలిచిన తిలక్.. క్రీజులో ఉన్నంతసేపు అదే జోరును కొనసాగించాడు. విప్రాజ్ 13వ ఓవర్లో 6,4 బాదిన సూర్య సైతం కుల్దీప్ 14వ ఓవర్లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే హార్దిక్ (2) కూడా నిష్క్రమించినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్.. నమన్ ధీర్ (38*)తో కలిసి ముంబైకి భారీస్కోరును అందించాడు.
ముంబై: 20 ఓవర్లలో 205/5 (తిలక్ 59, రికెల్టన్ 41, కుల్దీప్ 2/23, విప్రాజ్ 2/41);
ఢిల్లీ: 19 ఓవర్లలో 193 (కరుణ్ 89, పొరెల్ 33, కర్ణ్ 3/36, శాంట్నర్ 2/43)