ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత నెలలో మొదలైన ఈ సీజన్లో శనివారం టైటిల్ పోరు జరుగనుంది. ఫైనల్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సీజన్ ఫైనల్లో ఇదే ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ.. రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు ముందు నిలవలేక చతికిలపడింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరిన మెగ్ లానింగ్ సేన.. మూడో ప్రయత్నంలో అయినా టైటిల్ కలను నెరవేర్చుకుంటుందా? లేక సొంత మైదానంలో ముంబై మళ్లీ కప్పును ఎగరేసుకుపోతుందా? అన్నది నేడు తేలనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు మొదలవనుంది.
బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లూ పటిష్టంగానే ఉన్నాయి. ముంబై తరఫున ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న నటాలీ సీవర్ బ్రంట్ (493 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. సీవర్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ హీలి మాథ్యూస్ (304 రన్స్, 17 వికెట్లు) ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఫైనల్లోనూ ఈ ఇద్దరూ ఇదే జోరును కొనసాగించాలని ముంబై ఆశిస్తోంది. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (236 రన్స్) బ్యాట్‌తో పాటు తన వ్యూహాలతో మైదానంలో ప్రత్యర్థి జట్లను తిప్పలు పెడుతోంది. ఇక స్పిన్నర్ అమెలియా కెర్ (16 వికెట్లు) మరోసారి బ్రబౌర్న్‌లో సత్తా చాటితే ఢిల్లీకి కష్టాలు తప్పవు.
ఢిల్లీ కూడా తక్కువేమీ తినలేదు. ఆరంభంలోనే తనదైన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే షెఫాలీ వర్మ (300 పరుగులు) మంచి టచ్‌లో ఉండగా కెప్టెన్ మెగ్ లానింగ్ (263 రన్స్), నిలకడగా రాణిస్తోంది. ఈ ఓపెనింగ్ ద్వయాన్ని అడ్డుకోకుంటే ముంబై భారీ మూల్యం చెల్లించక తప్పదు. మిడిలార్డర్లో జెమీమా, అన్నాబెల్, జొనాసెన్తో పాటు పేస్ ఆల్‌రౌండర్ మరిజన్నె కాప్ వంటి హిట్టర్లు ఢిల్లీ సొంతం. ఢిల్లీ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపై క్యాపిటల్స్ విజయం ఆధారపడి ఉంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌కు అనుకూలిస్తున్న బ్రబౌర్న్ పిచ్‌పై ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.