ముంబై : ఐపీఎల్-18 ప్లేఆఫ్స్‌లో చేరే నాలుగో జట్టేదో బుధవారం తేలనుంది! గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ఇది వరకే ప్లేఆఫ్స్ బెర్తులను ఖాయం చేసుకోగా బుధవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరుగబోయే ముంబై, ఢిల్లీ మ్యాచ్‌తో నాలుగో బెర్తుపై స్పష్టత రానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై.. 12 మ్యాచ్‌లలో 7 గెలిచి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ కూడా అన్నే మ్యాచ్‌లలో ఆరింటిలో గెలిచి 13 పాయింట్లతో ఉంది.
సొంత మైదానంలో ముంబై గనక గెలిస్తే.. 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీ ఎలిమినేట్ (ఎందుకంటే పంజాబ్‌తో ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లే ఉంటాయి) అవడం ఖాయం. ఒకవేళ ముంబై ఓడితే ఆ జట్టు ఈనెల 26న పంజాబ్‌తో మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవడంతో పాటు.. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఓడిపోతేనే హార్దిక్ సేనకు నాకౌట్ ఆశలుంటాయి.