ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై.. లీగ్‌లో వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (43), జెమీమా రోడ్రిగ్స్ (25) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖ్, వాంగ్, హీలీ మాథ్యూస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 15 ఓవర్లలో 2 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఓపెనర్లు యస్తిక భాటియా (41; 8 ఫోర్లు), హీలీ మాథ్యూస్ (32; 6 ఫోర్లు) దంచికొట్టగా.. షివర్ (23 నాటౌట్), హర్మన్ (11 నాటౌట్) మిగిలిన పని పూర్తి చేశారు. సైకా ఇషాఖ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడనుంది.