IPL | ముంబై : సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్ క్రమంగా పుంజుకుంటున్నది. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్‌తో అనూహ్య విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)నూ చిత్తు చేసింది. వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించి సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా బ్యాటర్లు వేగంగా ఆడి ఆ జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ (26 బంతుల్లో 36, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రికెల్టన్ (23 బంతుల్లో 31, 5 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. 20 ఓవర్లలో 162/5కే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40, 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా క్లాసెన్ (38) ఫర్వాలేదనిపించాడు. జాక్స్ (2/14)తో పాటు ఎంఐ పేసర్లు హైదరాబాద్‌ను కట్టడిచేశారు. విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ తడబడ్డ పిచ్‌పై ముంబై మాత్రం అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. షమీ రెండో ఓవర్లోనే ఇంప్యాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) తనదైన ట్రేడ్‌మార్క్ సిక్సర్లతో అలరించాడు. కమిన్స్ ఓవర్లోనూ స్కేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టిన హిట్‌మ్యాన్.. అదే ఓవర్లో ఐదో బంతికి హెడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (31).. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. హర్షల్ 8వ ఓవర్లోనూ బ్యాక్‌టుబ్యాక్ బౌండరీలు కొట్టిన అతడు.. ఐదో బంతికి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యతో జతకలిసిన జాక్స్.. ముంబై ఛేదనను వేగవంతం చేశాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. మూడో వికెట్‌కు 29 బంతుల్లోనే 52 రన్స్ జోడించిన వీరిని కమిన్స్ విడదీశాడు. సూర్యతో పాటు జాక్స్ కూడా కమిన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరినా ముంబై పెద్దగా ఇబ్బందిపడలేదు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్(21), నమన్ ధీర్(0) వెంటవెంటనే ఔటైనా..సాంట్నర్(0)తో కలిసి తిలక్‌వర్మ(21 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కమిన్స్(3/26), మలింగ(2/36) ఆకట్టుకున్నారు.
‘ట్రావిషేక్’.. ఈ జోడీ పేరు చెబితేనే ప్రత్యర్థులకు దడ. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే విధ్వంస రచనను మొదలుపెట్టే ఈ జంట.. మందకొడి వాంఖడే పిచ్‌పై మాత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడింది. వీలైనన్ని ఎక్కువ రన్స్ రాబట్టే పవర్ ప్లేలో.. హైదరాబాద్ చేసింది 46 పరుగులే. 8 ఓవర్ల దాకా క్రీజులో అభిషేక్, హెడ్ ఉన్నా స్కోరు వేగం పుంజుకోలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే విల్ జాక్స్ క్యాచ్ జారవిడవడంతో లైఫ్ లభించిన అభిషేక్.. చాహర్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో అలరించాడు. కానీ మరో ఎండ్‌లో హెడ్ మాత్రం ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తంటాలు పడ్డాడు. హార్దిక్ 8వ ఓవర్లో బంతినందుకుని.. అభిషేక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ సెంచరీ మినహా చెత్తగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (2) ఆటతీరు మారలేదు. హార్దిక్ 10వ ఓవర్లో ‘నో బాల్’ అండతో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెడ్.. దానిని సద్వినియోగం చేసుకోలేదు. హెడ్ 12 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా అతడి ఆట సహజశైలికి భిన్నంగా సాగింది. 29 బంతుల్లో 28 పరుగులు చేసిన హెడ్‌ను జాక్స్ బోల్తా కొట్టించాడు. జాక్స్‌తో పాటు ముంబై పేసర్లు మధ్య ఓవర్లలో ఎస్ఆర్హెచ్ను కట్టడిచేశారు. నితీశ్ (19) మళ్లీ విఫలమవగా.. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన క్లాసెన్.. చాహర్ 18వ ఓవర్లో 6 (హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఇదే తొలి సిక్సర్), 4, 4, 6తో 21 రన్స్ రాబట్టాడు. ఆఖర్లో అనికేత్ (18 నాటౌట్) మెరుపులతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
హైదరాబాద్: 20 ఓవర్లలో 162/5 (అభిషేక్ 40, క్లాసెన్ 37, జాక్స్ 2/14, బుమ్రా 1/21);
ముంబై: 18.1 ఓవర్లలో 166/6(జాక్స్ 36, రికల్టన్ 31, కమిన్స్ 3/26, మలింగ 2/36)