Hardhik Pandya : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల సెంట్రల్ కాంట్రాక్ట్(Central Contract) రద్దు భారత క్రికెట్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడకున్నా హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు కాంట్రాక్ట్ ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్, అయ్యర్‌లకు ఒక న్యాయం.. పాండ్యాకు ఒక న్యాయమా? అని కొందరు బీసీసీఐని కడిగేశారు. తాజాగా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్(Praveen Kumar) సైతం బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ‘పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి వచ్చాడా? అతడికెందుకు సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చారు?’ అని తీవ్రంగా విమర్శించాడు.
‘హార్దిక్ పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దొగొచ్చాడా? అతడు కూడా ఇషాన్, అయ్యర్ల మాదిరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సింది. అతడికి మాత్రమే ప్రత్యేక నియమాలు ఎందుకు? బీసీసీఐ పాండ్యా కాంట్రాక్ట్ విషయంలో కఠువుగా వ్యవహరించాల్సింది’ అని ప్రవీణ్ అన్నాడు.
అయ్యర్, ఇషాన్, పాండ్యా
నిరుడు వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన పాండ్యా ఆటకు దూరమయ్యాడు. మూడు నెలల తర్వాత ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం అయితే.. ఇషాన్, అయ్యర్ల మాదిరిగా అతడు కూడా దేశవాళీలో ఆడాలి. కానీ, పాండ్యా రంజీల్లో ఆడకున్నా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు.
పాండ్యా తన ఫిట్నెస్ గురించి ఎప్పటికప్పుడు ఎన్సీఏ(NCA)కు సమాచారమిచ్చాడు. తాను ఫిట్‌గా మారాక దేశవాళీ క్రికెట్ ఆడుతానని కూడా చెప్పాడు. కానీ, ప్రస్తుతం పాండ్యా ఎర్ర బంతితో బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా లేడని ఎన్సీఏ తెలిపింది. అందుకని రంజీల్లో ఆడకున్నా ఈ ఆల్‌రౌండర్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. బరోడా క్రికెటర్ అయిన పాండ్యా డీవై పాటిల్ టోర్నమెంట్లో ఆడాడు. ఇషాన్‌తో కలిసి వడోదర స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు.
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈమధ్యే జట్టుతో కలిశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి హెడ్‌కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) స్వాగతం పలికాడు. అనంతరం పాండ్యా తన గదిలో చిన్నపాటి పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న పాండ్యా ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ వీడియోను ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.