Irani Cup | లక్నో: ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్‌ను దేశవాళీలో దిగ్గజ జట్టు ముంబై సొంతం చేసుకుంది. ఈ ఏడాది రంజీ చాంపియన్ అయిన ముంబై.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా 27 ఏండ్ల తర్వాత ఈ ట్రోఫీని ముద్దాడింది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో ముంబైకి 121 పరుగుల కీలక ఆధిక్యం దక్కడంతో ముంబై విజేతగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 537 పరుగుల భారీ స్కోరు చేయగా రెస్టాఫ్ ఇండియా 416 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆట ఆఖరి రోజు ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు చేసి తమ ఆధిక్యాన్ని 450 పరుగులకు పెంచుకుంది. చివరి రోజు ఆ జట్టు లోయరార్డర్ బ్యాటర్ తనుష్ కొటియాన్ (114 నాటౌట్) శతకంతో చెలరేగగా పదో నంబర్ ఆటగాడు మోహిత్ అవస్థి (51) అర్ధ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తరఫున డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ (222 నాటౌట్)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 1997-98 సీజన్ తర్వాత ముంబై జట్టు ఇరానీ కప్‌ను గెలవడం ఇదే ప్రథమం.