MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా తమ పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. భార్య సాక్షి సింగ్(Sakshi Singh)తో కలిసి ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లాలోని ల్వాలి(Lwali) గ్రామంలో ఉన్న తమ తాత ముత్తాతల ఇంటిని సందర్శించాడు.
అంతేకాదు ధోనీ దంపతులు ఆ ఇంటి ముంగట కూర్చొని నవ్వుతూ ఫొటోలు దిగారు. ఆ ఫొటోతో పాటు ఆ ఇంటి వీడియోను కూడా సాక్షి సింగ్ ఆన్లైన్ పోస్ట్ చేసింది. ‘అందరు ధోనీల సమక్షంలో అద్భుతమైన రోజు. నన్ను నమ్మండి.. ఇక్కడ చాలామంది ధోనీలు ఉన్నారు’ అంటూ సాక్షి తన పోస్ట్‌కు ఆసక్తికర క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఆ ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నవంబర్ 15న పెట్టిన ఈ పోస్ట్‌కు ఇప్పటికే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ‘థాంక్యూ సాక్షి. ధోనీ తన గురించి పోస్టులు పెట్టడం మానేశాడు. మీరైనా అతడిని ఆన్లైన్లో చూసే అవకాశం కల్పిస్తున్నారు’ అంటూ ఆ పోస్ట్ చూసిన కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే.. 2020 ఆగష్టులో మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.