IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారడంతో ప్రతి మ్యాచ్ నాకౌట్ తరహాలో సాగుతోంది. మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో అలరిస్తుంటే.. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ కూడా అదే స్థాయిలో హీట్ పెంచుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ జెయింట్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా 13 పాయింట్లతో గట్టి పోటీ ఇస్తోంది. ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన తాజా సోషల్ మీడియా డేటా ఆసక్తికర చర్చకు దారితీసింది. మార్చి 28 నుంచి మే 12 వరకు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించబడిన ఆటగాళ్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ విశ్లేషించింది.
ఇందులో విరాట్ కోహ్లీ 44 శాతం చర్చలతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ బ్యాటింగ్, మైదానంలో అతని అగ్రెసివ్ ఆటతీరు ఎప్పటిలాగే అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా 21 శాతం చర్చలతో రెండో స్థానంలో నిలవడం. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే కాలికి గాయమవడంతో ధోనీ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అయినప్పటికీ ఆయనపై అభిమానుల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ధోనీ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం విశేషం. ఈ జాబితాలో రోహిత్ శర్మ 18 శాతం చర్చలతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక సంజూ శాంసన్ 10 శాతం, కేఎల్ రాహుల్ 8 శాతం చర్చలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆర్ఆర్ తరఫున ఆడుతున్న అతను కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ సీనియర్ స్టార్ ఆటగాళ్ల క్రేజ్ ముందు అతనికి టాప్ లిస్టులో చోటు దక్కలేదు. అయితే భవిష్యత్తులో అతను పెద్ద స్టార్‌గా ఎదగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ధోనీపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ధోనీ ఆడితే చూడాలని ఉందని అభిషేక్ తన మనసులో మాట బయటపెట్టాడు. దీంతో ధోనీ అభిమానులు మరోసారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.