MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఈ లెజెండరీ క్రికెటర్ ఎక్కడ కనిపించినా ‘సెల్ఫీ ప్లీజ్’ అంటూ వెంటపడుతారు. మహీ కూడా అభిమానులతో కలివిడిగా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈమధ్యే ధోనీ ఒక ఫ్యాన్‌కు తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఓ అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ముంబై(Mumbai) నుంచి రాంచీ(Ranchi) వరకు అతడి పక్క సీటులో కూర్చొని ప్రయాణించాడు. ‘ఈ రెండున్నర గంటల ప్రయాణం నా జీవితంలో అత్యంత విలువైనది’ ఆ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ఈ జర్నీ విశేషాలను రాసుకొచ్చాడు.
‘ధోనీ ఇల్లు మాకు దగ్గర్లోనే ఉండేది. అక్కడే 20 ఏళ్లు ఉన్నాను. అతను మా సిటీకి ఎంతో గర్వకారణం. మహీ ఆటకు నేను వీరాభిమానిని. అయినా ఒక్కసారి కూడా అతడిని కలిసే చాన్స్ రాలేదు. కానీ, ఆ దేవుడు మహీని కలిసే రోజు రాసిపెట్టాడు. ఈమధ్యే నేను ముంబై నుంచి వస్తుండగా నా సీటు మార్చుకున్నా. కొంచెం సేపటికి ‘హలో.. నన్ను కిటికీ సీటు దగ్గరకు వెళ్లనివ్వండి’ అంటూ బాగా తెలిసిన గొంతు వినిపించింది. ఎవరని చూసే సరికి ధోనీ. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. అలా మహీని కలవాలన్న నా కల నెరవేరింది. మాది రాంచీ అని చెప్పాను.
దాంతో ధోనీ నాతో మాట కలిపాడు. తనకు ఇష్టమైన వంటకం, ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్‌లు, బైక్‌లతో పాటు రాంచీ అంటే తనకు ఎంత ఇష్టమో ధోనీ చెప్పాడు. అంతేకాదు తన కూతురు జీవా(Ziva)ను ప్రతిరోజు స్కూల్ దగ్గర వదిలేయడం వంటి విషయాలు నాతో పంచుకున్నాడు. నిజం చెప్పాలంటే.. ఆ రెండున్నర గంటలు నా జీవితంలో అమూల్యమైన క్షణాలు’ అని సదరు అభిమాని తన పోస్ట్‌లో వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో మహీ చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings)కు ట్రోఫీ సాధించి పెట్టాడు. దాంతో, సీఎస్కే ఐదో టైటిల్‌తో ముంబై ఇండియన్స్(Mumbai Indians) రికార్డు సమం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గాయపడిన ధోనీ ఫైనల్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న మహీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నాడు. అయితే.. ఈ దిగ్గజ కెప్టెన్ 2024 ఐపీఎల్లో ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.