MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్‌కు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆటగాడిగానే గాక గొప్ప మానవతావాదిగా అభిమానుల మన్ననలను అందుకున్న ధోని.. తన కెరీర్ ఆరంభంలో సాయం చేసిన ఎందరికో వారికి అవసరమున్నప్పుడు ఆదుకున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలు అతడు ఎప్పుడూ బహిరంగపరచలేదు. మీడియాకు దూరంగా తన పని తాను చేసుకుపోయే ధోనిపై తాజాగా BAS (బీట్ ఆల్ స్పోర్ట్స్) ఓనర్ సోమి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా బాస్ బ్యాట్ వాడిన ధోని.. అప్పుడు బ్యాట్‌పై తమ కంపెనీ స్టిక్కర్ అంటించినందుకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని చెప్పాడు.
ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘2019 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ధోని బాస్ బ్యాట్ వాడాడు. ఇందుకు గాను అతడు మా వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ధోనికి కొంత అయినా నగదు ఇవ్వాలని నేను చాలా ప్రయత్నించాను. అతడి భార్య, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌తో కూడా చెప్పి చూశాను. కానీ అతడు మాత్రం తనకు వద్దంటే వద్దని చెప్పాడు. మీరు నాకు నా కెరీర్ తొలి రోజుల్లో సాయం చేశారు. ఇది నేను మీకు ఇస్తున్న ట్రిబ్యూట్.. అని నాతో చెప్పాడు’ అని తెలిపాడు.
MS Dhoni – a true gentleman of the game. 🫡pic.twitter.com/yOLb5s2LLj
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2024
కోహ్లీ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న ధోని ఫ్యాన్స్‌ను ఈ వీడియో మరింత సంతోషపడేలా చేస్తోంది. ధోని ఇటీవలే తాను సైన్ చేసిన బ్యాట్‌ను చిన్ననాటి మిత్రుడు పరమ్‌జిత్ సింగ్‌కు అందించిన విషయం విదితమే. కెరీర్ ఆరంభంలో ధోనికి అంతగా పేరు రానప్పుడు ధోని కిట్ బ్యాగ్‌కు ‘బస్’ స్పాన్సర్‌గా ఉండేది. ఆ కృతజ్ఞతతోనే వన్డే వరల్డ్ కప్‌లో ధోని ఆ స్టిక్కర్ ఉన్న బ్యాట్‌ను వాడాడు.