Vaibhav Suryavanshi : తాను ఇప్పటివరకు సాధించిన ప్రతి విజయం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఉందని ఐపీఎల్ (IPL) లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్.. సోమవారం గుజరాత్ (Gujarat) తో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో సెంచరీ బాది రాజస్థాన్ (Rajasthan) గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
వైభవ్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. పలువురు క్రీడారంగ ప్రముఖులు వైభవ్‌ను అభినందనల్లో ముంచెత్తారు. అయితే ఇప్పుడు తాను అందుకుంటున్న ఈ అభినందనలు తనకంటే తన తల్లిదండ్రులకే ఎక్కువ చెందుతాయని వైభవ్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం తన తల్లిదండ్రులేనని చెప్పాడు. తనకు కోసం అమ్మ వేకువజామునే నిద్ర లేచేదని గుర్తుచేశాడు.
వేకువజామునే లేచి తన ప్రాక్టీస్ కోసం ఆహారం సిద్ధం చేసి పంపించేదని, ఆమె కేవలం మూడు గంటలు మాత్రమే నిద్ర పోయేదని వైభవ్ చెప్పాడు. తన కోసం తన తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడని తెలిపారు. కుటుంబం కోసం తన అన్నయ్య పని చేశాడని, తాము చాలా కష్టాలు పడ్డామని అతను గుర్తుచేసుకున్నాడు. ఎలాంటి సందర్భమైనా తన తండ్రి తనకు మద్దతుగా నిలిచాడని చెప్పాడు.
ఇప్పుడు మీరంతా చూస్తున్న ఫలితం, విజయం కేవలం తన అమ్మానాన్నల వల్లే వచ్చిందని వైభవ్ అన్నాడు. వైభవ్ మాట్లాడిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.