Mohammed Siraj | మహమ్మద్ సిరాజ్..ఇప్పుడు ఎక్కడా చూసినా అందరి నోట ఇదే మాట. అరే వారెవ్వా సిరాజ్ అదరగొట్టాడు, ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకను ఓ ఆటాడుకున్నాడు, వన్డే ప్రపంచకప్‌లో భారత ఆశాకిరణం సిరాజ్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఈ ప్రశంసల వెనుక అతని కఠోర శ్రమ దాగుంది.
టెస్టు బౌలర్‌గా ముద్రపడి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రధాన బౌలర్ స్థాయికి ఎదగడం వెనుక ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అనేక కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు. ఓవైపు తండ్రి లేని లోటును దిగమింగుతూ దేశం తరఫున రాణించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఆసియాకప్ ద్వారా తన సత్తాఏంటో చూపెట్టిన సిరాజ్..స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి సై అంటున్నాడు. వన్డేల్లో తిరిగి నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న సిరాజ్‌పై ప్రత్యేక కథనం.
భారత బలమంతా బ్యాటింగే. ఇది పాత మాట. ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించే స్వింగ్‌తో వికెట్ల వేట కొనసాగించే పేస్ బౌలర్ల అడ్డా భారత్ ఇప్పుడు. ఇది కాదనలేని సత్యం. రవిశాస్త్రి చీఫ్ కోచ్‌గా ఉన్న సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వేసిన పునాదులు టీమ్ఇండియాను పేస్ పవర్‌హౌజ్‌గా మార్చాయి. ఇన్నాళ్లు స్పిన్‌పైనే అతిగా ఆధారపడ్డ టీమ్ఇండియా..ఇప్పుడు పేస్‌తో ప్రత్యర్థి జట్ల భరతం పడుతున్నది. మన హైదరాబాదీ పేస్ సంచలనం మహమ్మద్ సిరాజ్..లంకపై సంచలన ప్రదర్శనే దీనికి నిలువెత్తు నిదర్శనం. టెన్నిస్ బాల్‌తో హైదరాబాద్ గల్లీల్లో స్లిప్పర్లతో బౌలింగ్ చేసిన సిరాజ్..టీమ్ఇండియాకు ఆయువుపట్టుగా మారాడు. దినదిన ప్రవర్ధమానంగా రోజురోజుకు తన ప్రతిభకు మెరుగులు అద్దుకున్న ఈ స్వింగ్‌స్టర్ అనతికాలంలోనే ప్రపంచ స్థాయి బౌలర్‌గా ఎదిగాడు.
కెరీర్ తొలినాళ్లలో ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడన్న అపవాదును తన సూపర్స్వింగ్తో చెరిపివేస్తూ..వికెట్ల వేటలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నాడు. ప్రధాన బౌలర్ బుమ్రా గైర్హాజరీలో భారత బౌలింగ్ భారాన్ని తన భుజాలపై మోస్తూ సిరాజ్ చిరస్మరణీయ విజయాల్లో భాగమవుతున్నాడు. ఇన్నాళ్లు ఇన్‌స్వింగర్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన సిరాజ్..ఇప్పుడు తన ప్రధాన అస్త్రం ఔట్‌స్వింగర్‌తో బోల్తా కొట్టిస్తున్నాడు. లంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో నలుగురిని ఔట్ చేసి ఔరా అనిపించాడు. గత ఐపీఎల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకున్న సిరాజ్..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. గత వెస్టిండీస్ పర్యటనలో బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే నేతృత్వంలో తన బౌలింగ్‌కు మరింత మెరుగులు అద్దుకున్న సిరాజ్..ఇప్పుడు తన స్వింగ్‌తో శాసిస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బ్యాటర్లకు అగ్నిగోళల్లాంటి బంతులు వేస్తూ ఆదిలోనే బ్రేక్‌లు వేస్తున్నాడు. రానున్న ప్రపంచకప్‌లోనూ సిరాజ్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్ చిరకాల కల నెరవేరినట్లే.