ముంబై: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను.. క్రికెటర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ న్యూస్ షికార్లు చేశాయి. అయితే ఇటీవల యూట్యూబ్ లో శుభాంకర్ మిశ్రాకు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సానియాతో పెళ్లి రూమర్ గురించి ఆ ఇంటర్వ్యూలో అడిగారు. ఆ ప్రశ్నకు తీవ్రంగా స్పందించిన షమీ.. ఆ వార్తలను కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాపి చేయడాన్ని ప్రజలు మానుకోవాలని షమీ సూచించాడు. మీమ్స్ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, కానీ ఆ మీమ్స్ వల్ల హాని కూడా జరుగుతుందని షమీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో బాధ్యతాయుతంగా ఉండాలని, అసత్య ప్రచారానికి దూరంగా ఉండాలని షమీ సూచించాడు.
మీకు ధైర్యం ఉంటే వెరిఫైడ్ పేజీ నుంచి ఇలాంటి కామెంట్ చేస్తే, అప్పుడు దానికి సరైన రిప్లై వస్తుందని షమీ అన్నాడు. జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నించాలని, ఇతరులకు సాయం చేయాలని, మీకు మీరు అప్‌గ్రేడ్ కావాలని, అప్పుడు మీరు మంచి వ్యక్తులని భావిస్తామని షమీ పేర్కొన్నాడు. పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియా మీర్జా అతనికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.