కామన్వెల్త్ విజేతను అభినందించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించిన యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు, కామన్వెల్త్ గేమ్స్‌లో విజేతగా నిలువడం గర్వకారణమని అన్నారు.
ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ స్పందిస్తూ ‘2014లో కవితను కలువగా, ఆమె సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం..50లక్షలు మంజూరు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. దీనికి తోడు ఇటీవలే రెండు కోట్లు మంజూరు చేయడమే కాకుండా నివాస స్థలం కేటాయించారు. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్‌లో రాష్ర్టానికి మరింత ఖ్యాతి తీసుకొచ్చేందుకు కష్టపడుతాను’ అని అంది.