Mitchell Starc : ఈమధ్య కాలంలో డీఆర్ఎస్ (DRS) వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా యాషెస్ సిరీస్ మూడో టెస్టులోనూ డీఆర్ఎస్లోని స్నికోమీటర్ (Snickometer) లోపాలు స్పష్టంగా కనిపించాయి. అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు సందర్భాల్లో అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయగా ఆతిథ్య జట్టుకే అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దాంతో.. ఇంగ్లండ్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఐసీసీకి కీలక విజ్ఞప్తి చేశాడు. డీఆర్ఎస్ వ్యవస్థలోని లోపాలను సరి చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరాడు.
‘డిసిషన్ రివ్యూ సిస్టమ్ అనేది లోపభూయిష్టంగా ఉంది. ప్రేక్షకులకు, అధికారులకు, బ్రాడ్కాస్టర్లకు ఈ నియమం చిరాకు తెప్పిస్తోంది. డీఆర్ఎస్పై నా అభిప్రాయం చెప్పదలచుకున్నాను. ఈ వ్యవస్థను మ్యాచ్ అధికారులు ఉపయోగిస్తారు. అలాంటప్పుడు ఐసీసీ ఎందుకు డబ్బులు చెల్లించాలి. అన్ని బోర్డులకు ఒక్కరే ఈ సిస్టమ్‌ను ఎందుకు అందించడం లేదు. ఐసీసీ టోర్నీలతో పాటు అన్ని సిరీస్‌లకు ఒకేరకమైన సాంకేతికతను ఎందుకు ఉపయోగించడం లేదు.
Mitchell Starc has questioned why the ICC doesn’t pay for the DRS technology 🗣️ pic.twitter.com/IJLOucuCXE
— ESPNcricinfo (@ESPNcricinfo) December 22, 2025
ఒకవేళ అన్నింటా ఒకే టెక్నాలజీ ఉపయోగిస్తే గందరగోళం తగ్గుతుంది. అంతేకాదు ఎవరికీ చిరాకు పడరు అని ఐసీసీకి స్టార్క్ విన్నవించాడు. ఏకీకృత వ్యవస్థను తీసుకురావాలని సూచించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకనైనా ఐసీసీ ఉత్తమమైన డీఆర్ఎస్ వ్యవస్థను తీసుకురావాలి’ అని వాన్ సూచించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీని అంపైర్ ఔటిచ్చాడు. అయితే.. రివ్యూ తీసుకొని బతికిపోయిన ఆసీస్ వికెట్ కీపర్ ఏకంగా సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లోనూ డీఆర్ఎస్ నిర్ణయం ఆసీస్‌కు అనుకూలంగా వచ్చింది. బ్యాట్, బంతి మధ్య దూరం ఉన్నట్టు కనిపిస్తున్నా సరే స్నికోమీటర్ మాత్రం బంతి ఎడ్జ్ తీసుకున్నట్టు చూపించింది. దాంతో.. ఇంగ్లండ్ బ్యాటర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో గెలుపొందిన ఆతిథ్య జట్టు 3-0తో సిరీస్ పట్టేసింది.